North Korea: ఉత్తరకొరియాకు సంబంధించిన కీలక విషయాన్ని బయటపెట్టిన జపాన్ రక్షణమంత్రి

ABN , First Publish Date - 2022-11-18T15:12:49+05:30 IST

అమెరికా (America) ప్రధాన భూభాగాన్ని తాకగల సామర్థ్యమున్న క్షిపణిని ఉత్తరకొరియా (North Korea) సిద్ధం చేసిందా ?.. ఈ ప్రయోగం విజయవంతమైందా?.

North Korea: ఉత్తరకొరియాకు సంబంధించిన కీలక విషయాన్ని బయటపెట్టిన జపాన్ రక్షణమంత్రి

టోక్యో: అమెరికా (America) ప్రధాన భూభాగాన్ని తాకగల సామర్థ్యమున్న క్షిపణిని ఉత్తరకొరియా (North Korea) సిద్ధం చేసిందా ?.. ఈ ప్రయోగం విజయవంతమైందా?. దీంతో అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ (Kim Jong Un) మున్ముందు మరింత దూకుడుగా వ్యవహరించనున్నారా ? అనే ప్రశ్నలకు ఔననే సమాధానమే ఇస్తోంది జపాన్ (Japan). అమెరికా ప్రధాన భూభాగాన్ని చేరుకోగల సామర్థ్యమున్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ఉత్తరకొరియా శుక్రవారం ప్రయోగించిందని జపాన్ రక్షణమంత్రి యసుకజు హమద (Yasukazu Hamada) వెల్లడించారు. ఈ మిసైల్ పశ్చిమ హొక్కైడోకు 210 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో పడిందని తెలిపారు. ఈ క్షిపణికి 15 వేల కిలోమీటర్లు ప్రయాణించగలిగే సామర్థ్యం ఉందన్నారు. ఇదే రోజున ఉత్తరకొరియా మరో స్వల్పశ్రేణి బాలిస్టిక్ మిసైల్‌ను కూడా ప్రయోగించిందని చెప్పారు. కాగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిలో (ICBM) అమర్చిన వస్తువు ( ప్రక్షేపకం) 6 వేల కిలోమీటర్ల ఎత్తు చేరిందని జపాన్ కేబినెట్ సెక్రటరీ హిరోకజు మత్సునో ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే. 1000 కిలోమీటర్లు పరిధిలో వక్రమార్గంలో మిసైల్ ప్రయాణించిందని, ఒహిమా-ఒషిమా ఐలాండ్‌‌కు పశ్చిమాన 200 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో కూలిందని ప్రస్తావించిన సంగతి తెలిసిందే.

కిమ్ మరింత దూకుడు?

ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాన్ని అమెరికా ఖండించింది. మరోవైపు కఠిన చర్యలు ఉంటాయని దక్షిణకొరియా హెచ్చరించింది. అయినప్పటికీ ఉత్తరకొరియా వైఖరిలో ఎలాంటి మార్పులు కనిపించలేదు. ఎప్పటిలాగానే వార్నింగు ఇచ్చింది. ఈ ప్రాంతంలో యూఎస్ మిలిటరీ ఉనికి ఎక్కువైతే భయానక స్పందన ఉంటుందని గట్టి హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా చేరుకునే క్షిపణిని రూపొందించకముందే దూకుడుగా వ్యవహరించిన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ వైఖరి మున్ముందు ఎలా ఉండబోతోందనేది చర్చనీయాంశమవుతోంది. యుద్ధాలకు ఏమైనా దారితీసే అవకాశం ఉందా అనే కోణం ఆందోళన కలిగిస్తోంది.

Updated Date - 2022-11-18T15:12:56+05:30 IST