నీలి చిత్రాలను చూసే అలవాటు చాలా మందికి ఉంది, ప్రీస్ట్‌లు, నన్‌లకు కూడా : పోప్ ఫ్రాన్సిస్
ABN , First Publish Date - 2022-10-27T13:33:34+05:30 IST
ఆన్‌లైన్ పోర్నోగ్రఫీ చాలా ప్రమాదకరమైనదని పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) అన్నారు. దీనిని చూడటం వల్ల
రోమ్ : ఆన్‌లైన్ పోర్నోగ్రఫీ చాలా ప్రమాదకరమైనదని పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) అన్నారు. దీనిని చూడటం వల్ల ఆరాధనా హృదయం బలహీనపడుతుందన్నారు. క్రైస్తవులుగా ఉండటంలో ఆనందాన్ని పంచుకోవడానికి డిజిటల్, సోషల్ మీడియాను వాడుకోవాలని తెలిపారు. వార్తలను మితిమీరి చూడవద్దని, పని నుంచి మనసును పక్కదోవ పట్టించే మ్యూజిక్‌ను వినవద్దని చెప్పారు. రోమ్‌లో చదువుతున్న ప్రీస్ట్‌లు, సెమినరియన్ల ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు.
ఈ సందర్భంగా డిజిటల్ పోర్నోగ్రఫీ గురించి చెప్పుకోవాలని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు. ‘‘డిజిటల్ పోర్నోగ్రఫీ పట్ల మీకు ఆకర్షణ ఉందా? అనుభవం ఉందా? అనే విషయాలను మీరే ఆలోచించుకోండి. చాలా మందికి ఉండే దోషం ఇది. చాలా మంది సామాన్య పురుషులకు, చాలా మంది సామాన్య మహిళలకు, ప్రీస్ట్‌లకు, నన్స్‌కు కూడా ఉండే దోషం ఇది’’ అని తెలిపారు. ‘‘కేవలం బాలలపై లైంగిక దాడుల వంటి క్రిమినల్ పోర్నోగ్రఫీ గురించి మాత్రమే నేను చెప్పడం లేదు, లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులను ప్రత్యక్షంగా చూస్తుంటాం. అది చాలా నీచమైనది. అయితే నేను మాట్లాడుతున్నది చాలా సాధారణమైన పోర్నోగ్రఫీ గురించి’’ అని చెప్పారు.
పోప్ ఫ్రాన్సిస్ జూన్‌లో మాట్లాడినపుడు పోర్నోగ్రఫీపై తీవ్రంగా మండిపడ్డారు. స్త్రీ, పురుషుల గౌరవ, మర్యాదలపై ఇది శాశ్వత దాడి అని పేర్కొన్నారు. ప్రజారోగ్యానికి ముప్పుగా దీనిని ప్రకటించాలన్నారు.