Rishi Sunak: బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ తొలి సంచలన ప్రసంగం.. కఠిన నిర్ణయాలకు సిద్ధం కావాలని పిలుపు

ABN , First Publish Date - 2022-10-25T16:55:07+05:30 IST

లండన్: బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ తొలి ప్రసంగం చేశారు. రానున్న రోజుల్లో కఠిన నిర్ణయాలకు బ్రిటన్ ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Rishi Sunak: బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ తొలి సంచలన ప్రసంగం.. కఠిన నిర్ణయాలకు సిద్ధం కావాలని పిలుపు
Rishi Sunak, UK prime minister

లండన్: బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ (uk prime minister rishi sunak) తొలి ప్రసంగం చేశారు. రానున్న రోజుల్లో కఠిన నిర్ణయాలకు బ్రిటన్ ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అప్పుల సమస్య పరిష్కారాన్ని రానున్న తరాలకు వదిలేయబోనన్నారు. లిజ్ ట్రస్ ద్వారా జరిగిన తప్పిదాలను సరిచేయడానికే తాను ప్రధాని అయినట్లు రిషి సునాక్ చెప్పారు. లండన్ బకింగ్‌హామ్ ప్యాలెస్‌‌లో కింగ్ చార్లెస్ III (king charles iii)ను రిషి సునాక్ నేడు కలిశారు. లిజ్ ట్రస్ (liz truss) ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకోవడం, రిషి సునాక్‌ ప్రధాని బాధ్యతలు స్వీకరించడం అంతా నిమిషాల్లో జరిగిపోయాయి.

అంతకు ముందు బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ చివరి ప్రసంగం చేశారు. బ్రిటన్ కష్టకాలంలో ఉందని అయితే అతి త్వరలోనే మళ్లీ కోలుకుంటుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. తనకు బ్రిటన్ పౌరులపై నమ్మకముందని చెప్పారు. బ్రిటన్ ప్రధానిగా కొత్తగా ఎన్నికైన రిషి సునాక్‌కు ఆమె ఆల్ ది బెస్ట్ చెప్పారు. బ్రిటన్ రాణికి జాతి అంతిమ వీడ్కోలు పలికిన సమయంలో తాను బ్రిటన్ ప్రధానిగా ఉండటం తనకు గౌరవనీయమని విషయమని లిజ్ ట్రస్ చెప్పుకున్నారు. పుతిన్‌పై ఉక్రెయిన్ ధైర్యంగా పోరాడుతోందని, అందరూ ఉక్రెయిన్‌కు మద్దతునీయాలని సూచించారు.

బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ తప్పుకున్నాక లిజ్ ట్రస్ అధికార కన్సర్వేటివ్ పార్టీ నుంచి ప్రధానిగా ఎన్నికయ్యారు. కన్సర్వేటివ్ పార్టీ తరపున రిషి సునాక్, లిజ్ ట్రస్ మధ్యే పోటీ జరిగింది. చివరకు లిజ్ ట్రస్ విజేతగా నిలిచారు. కానీ ఆమె తీసుకు వచ్చిన మధ్యంతర బడ్జెట్ బ్రిటీష్ వారి ఆర్ధిక వ్యవస్థను మరింత అస్తవ్యస్తం చేసింది. లిజ్ ట్రస్ ఆర్ధిక విధానాలతో బ్రిటన్ మరింత కష్టాల్లో చిక్కుకుంది. ఈ తరుణంలో అధికారం చేపట్టిన 45 రోజులకే ఆమె యూ టర్న్ తీసుకున్నారు. ప్రధానిగా తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత కన్సర్వేటివ్ పార్టీ రిషి సునాక్‌ను ప్రధానిగా ఎన్నుకుంది. వెయిటర్ నుంచి ప్రధాని స్థాయికి ఎదిగిన రిషి సునాక్ బ్రిటన్ చరిత్రలోనే ప్రధాని బాధ్యతలు స్వీకరించిన అత్యంత పిన్న వయస్కుడు.

ఇంగ్లాండ్ సౌతాంఫ్టన్‌లో జన్మించిన సునాక్‌ ప్రస్తుత వయసు 42 సంవత్సరాలు. ఆయన తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికా నుంచి ఇంగ్లాండ్‌కు వలస వెళ్లారు. తండ్రి యశ్‌వీర్ డాక్టర్. తల్లి ఉషా సునాక్ ఫార్మసిస్ట్. రిషి తండ్రి కెన్యాలో పుట్టి పెరిగారు. తల్లి టాంజానియాలో పుట్టి పెరిగారు. వీరి పూర్వీకులు పంజాబ్ ప్రావిన్స్‌కు చెందినవారు. కెన్యా రిషి సునాక్ వించెస్టర్ కాలేజీలో చదువుకున్నారు. ఆక్స్‌ఫర్డ్, లింకన్ కాలేజీలో ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకానమిక్స్ చదివారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఆయన ఎంబీఏ చేశారు. విద్యార్ధిగా ఉన్న సమయంలో సౌతాంఫ్టన్‌లోని ఓ భారతీయ రెస్టారెంట్‌లో రిషి సునాక్ వెయిటర్‌గా పనిచేశారు. 2009లో రిషి సునాక్ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతామూర్తిని వివాహమాడారు. వీరికి ఇద్దరు సంతానం. కృష్ణా సునాక్, అనౌష్కా సునాక్.

Updated Date - 2022-10-25T18:32:00+05:30 IST