Punjab : చిన్ననాటి కలలకు రెక్కలు తొడిగిన పంజాబీ రైతు
ABN , First Publish Date - 2022-12-04T14:44:40+05:30 IST
ఎన్నో కలలు కంటూ, వాటిని మధ్యలోనే మర్చిపోయేవాళ్లు చాలా మంది కనిపిస్తారు.
న్యూఢిల్లీ : ఎన్నో కలలు కంటూ, వాటిని మధ్యలోనే మర్చిపోయేవాళ్లు చాలా మంది కనిపిస్తారు. కానీ పంజాబ్‌లోని భటిండాకు చెందిన యద్వీందర్ సింగ్ ఖోఖర్ (49) మాత్రం తన చిన్ననాటి కలలను సాకారం చేసుకుంటున్నారు. గగనయానంపై ఎంతో మక్కువగల ఆయన ఏరోమోడలింగ్‌లో తన ప్రతిభను చాటుకుంటూ, విద్యార్థులకు ఏరోనాటిక్స్‌లో సూక్ష్మాలను బోధించే స్థాయికి ఎదిగారు. ఆయన సృజనాత్మకత, నవ కల్పనలు ఆయనకు అనేక పురస్కారాలను తెచ్చిపెట్టాయి.
పంజాబ్‌లోని భటిండా జిల్లా, భగ్టా భాయ్ కా సబ్ తహశీల్, సిర్యేవాలా గ్రామవాసి యద్వీందర్ మాట్లాడుతూ, పక్షిలా ఎగరాలని తనకు చిన్నప్పటి నుంచి బలమైన కోరిక ఉండేదన్నారు. డిగ్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిప్లమో పూర్తయిన తర్వాత 1996లో వ్యవసాయ రంగంలోకి అడుగు పెట్టానని చెప్పారు. 2007లో తన కుటుంబంలో ఒకరికి వివాహం జరిగిందని, అప్పుడు తాను బ్రిటన్ వెళ్ళానని చెప్పారు. అక్కడ ఉన్న ఓ ఫ్లయింగ్ క్లబ్‌లో కొన్ని ఏరోమోడల్స్‌ను చూసిన తర్వాత తన మనసు పొరల్లో దాగిన తన కలలు రెక్కలు తొడుక్కుని ఎగిరాయని చెప్పారు. దీంతో రెండు చిన్న ఏరోమోడల్స్‌ను అక్కడి నుంచి తీసుకొచ్చానని తెలిపారు. ఏరోమోడలింగ్‌పై ఆసక్తి పెరగడంతో తాను ఇంటర్నెట్‌లో అన్వేషించానని తెలిపారు. ఆ తర్వాత ఢిల్లీలోని ఓ సంస్థలో ఏరోమోడలింగ్‌లో శిక్షణ పొందానని చెప్పారు. ఈ సంస్థను కొందరు మాజీ సైనిక, వాయు సేన అధికారులు నడిపేవారన్నారు. వారు ప్రచురించే మ్యాగజైన్‌లో ఫ్లయింగ్ థియరీ, ఎలక్ట్రానిక్ సెటప్, ఇంజిన్ సెటప్, విమానాలు ఎలా ఎగురుతాయి? వంటి అంశాలను వివరించేవారని చెప్పారు.
శిక్షణ పూర్తయిన తర్వాత తానే సొంతంగా ఏరో మోడల్స్‌ను తయారు చేయడం ప్రారంభించానని తెలిపారు. తన ఫామ్‌హౌస్ వద్ద ఓ ఎకరా స్థలంలో రన్‌వే, వర్క్‌షాప్, ఏరోమోడలింగ్ లేబరేటరీలను నిర్మించామని చెప్పారు. రకరకాల మోడల్స్‌లో విమానాలను తయారు చేసి, పొలంలోనే ఎగురవేస్తూ ఉంటానని చెప్పారు. ఈ ఏరో మోడల్స్ టేకాఫ్, ల్యాండింగ్ సరైన విధంగా జరుగుతోందన్నారు. వీటిని హై డెన్సిటీ స్పెషల్ థర్మోకోల్‌తో తయారు చేస్తున్నట్లు తెలిపారు. భారీ పరిమాణం (Big Size)లో వీటిని తయారు చేస్తున్నట్లు తెలిపారు.
సీ-130 మోడల్‌కు పురస్కారం
సీ-130 హెర్క్యులస్ రవాణా విమానం నమూనాను ఇటీవల తయారు చేశానని చెప్పారు. మన దేశంలో చేతితో తయారు చేసిన అతి పెద్ద విమానం నమూనా ఇదేనని తెలిపారు. దీనిని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈ ఏడాది ఆగస్టులో గుర్తించిందని చెప్పారు. తాను సుఖోయ్ జెట్ సహా అనేక విమానాల మోడల్స్‌ను తయారు చేశానని చెప్పారు. ఇప్పుడు ఆంటనోవ్ 225 మోడల్ రవాణా విమానం మోడల్‌ను తయారు చేస్తున్నానని చెప్పారు. దీని రెక్కల నిడివి 12 అడుగులని చెప్పారు.
మార్గదర్శకాలకు అనుగుణంగానే...
ఏరో మోడల్స్‌కు సంబంధించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే తాను వీటిని తయారు చేస్తున్నానని చెప్పారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిర్దేశించిన నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నట్లు చెప్పారు.
3 విశ్వవిద్యాలయాలతో ఒప్పందం
ఏరోనాటిక్స్‌లో సూక్ష్మమైన విషయాలను విద్యార్థులకు బోధించేందుకు తాను మూడు విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. చండీగఢ్ విశ్వవిద్యాలయం, మహారాజా రంజిత్ సింగ్ పంజాబ్ టెక్నికల్ విశ్వవిద్యాలయం, భటిండా; జీఎన్ఏ విశ్వవిద్యాలయం, ఫగ్వారాలతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు.
ఏరో మోడల్స్‌ను తయారు చేయడంలో శిక్షణ ఇచ్చేందుకు విద్యార్థుల కోసం వర్క్‌షాప్‌లను నిర్వహిస్తున్నాని తెలిపారు. తన ఫామ్‌హౌస్ వద్ద ఉన్న ఏరో మోడల్స్‌ను కూడా చూపించి, బేసిక్ డిజైనింగ్, ట్రైనింగ్ తరగతులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
పాఠ్య ప్రణాళిక
ఏరోమోడలింగ్‌పై సవివరమైన సిలబస్‌ను తాను మహారాజా రంజిత్ సింగ్ టెక్నికల్ విశ్వవిద్యాలయంలో రిజిస్టర్ చేయించానని తెలిపారు. కోర్సులో భాగంగా దీనిని విద్యార్థులకు బోధిస్తారని తెలిపారు. చాలా విశ్వవిద్యాలయాలు, చాలా సైనిక రెజిమెంట్లు తనను సత్కరించాయని చెప్పారు. రక్షణ దళాల కోసం కూడా తాను కొన్ని ప్రాజెక్టులను చేస్తున్నానని తెలిపారు.
వారసుడు
తన కుమారుడు తన నుంచి స్ఫూర్తిని పొంది ఏరోనాటికల్ ఇంజినీర్ అయ్యాడని చెప్పారు.