Aadhaar: బాబోయ్... ఆధార్ అనుసంధానం!
ABN , First Publish Date - 2022-12-01T10:21:35+05:30 IST
విద్యుత్ కనెక్షన్‌కు ఆధార్(Aadhaar) అనుసంధానం తప్పనిసరి అని రాష్ట్ర విద్యుత్ బోర్డు(State Electricity Board) ప్రకటించడంతో
- బెంబేలెత్తుతున్న అద్దింటివాసులు
చెన్నై, నవంబరు 30: (ఆంధ్రజ్యోతి): విద్యుత్ కనెక్షన్‌కు ఆధార్(Aadhaar) అనుసంధానం తప్పనిసరి అని రాష్ట్ర విద్యుత్ బోర్డు(State Electricity Board) ప్రకటించడంతో అటు ఇంటి యజమానులు, ఇటు అద్దె ఇళ్లల్లో నివసిస్తున్నవారు బెంబేలెత్తిపోతున్నారు. అద్దె ఇళ్లల్లో నివసిస్తున్నవారు తమ ఆధార్‌కార్డు అనుసంధానం చేసిన రెండు మూడు నెలల తర్వాత బదిలీ వల్లనో లేక ఇతర కారణాల వల్లనో మరో ఇంటికి లేదా మరో ప్రాంతానికి వెళ్తే మరోమారు ఆధార్ అనుసంధానం చేయడానికి అవస్థలు పడాల్సి వస్తుందని భావిస్తున్నారు. ఇక ఇంటి యజమానులు విద్యుత్ బిల్లులో ఇంటి (స్థల) పత్రంలో ఒకే పేరుంటేనే ఆ ఇంటి యజమానిగా పరిగణిస్తారు. విద్యుత్ బిల్లులో అద్దెకున్నవారి ఆధార్ నమోదై, ఆస్తి పత్రంలో ఇంటి యజమాని ఆధార నమోదై ఉంటే ఆస్థిపరమైన చిక్కులు ఏర్పడే అవకాశం కూడా ఉందని భయపడుతున్నారు. విద్యుత్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇంటి యజమానులు లేనిపోని ఆర్థికపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వుంటుందని ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ బోర్డులో అద్దెకున్నవారి ఆధార్ వివరాలు పొందుపరచి ఉండటంతో తామే ఆస్తికి యజమానులమంటూ కోర్టుకెళ్లే తమ పరిస్థితి ఏమవుతుందని ఇంటి యజమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ అనుమానాలను నివృత్తి చేయడానికి రాష్ట్ర విద్యుత్ బోర్డు వెబ్‌సైట్‌లో తగు మార్పులు తీసుకువచ్చేందుకు సిద్ధమవుతుంది. ఆ వెబ్‌సైట్‌లో ఆధార్ అనుసంధానంపై ఏర్పడే అనుమానాలకు తగిన సమాధానాలు వెలువరించనున్నట్లు విద్యుత్ బోర్డ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.