India-China clash : చైనాను అడుగుపెట్టనివ్వలేదు : అమిత్ షా
ABN , First Publish Date - 2022-12-13T15:10:10+05:30 IST
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవంగ్ సెక్టర్‌లో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ సందర్భంగా
న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్‌లోని తవంగ్ సెక్టర్‌లో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ సందర్భంగా భారత దేశ భూభాగాన్ని చైనా ఆక్రమించుకోలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) స్పష్టం చేశారు. ఆయన మంగళవారం పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ, భారత దేశానికి చెందిన కనీసం ఒక అంగుళం భూమి కూడా ఆక్రమణకు గురికాలేదని తెలిపారు. చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో భారత సైనికులు అద్భుతమైన ధైర్యసాహసాలను ప్రదర్శించారని చెప్పారు. అతి తక్కువ సమయంలోనే చైనా దళాలకు దీటుగా జవాబు చెప్పారన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వంలో భారత దేశ భూభాగాన్ని కనీసం ఒక అంగుళం మేరకు అయినా ఎవరూ కబ్జా చేయలేరని తెలిపారు.
‘‘నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు మన భూమిలోని ఓ అంగుళం మేరకు అయినా ఎవరూ కబ్జా చేయలేరు’’ అని అమిత్ షా అన్నారు.
రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌పై...
రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (RGF)కు 2005, 2006, 2007 సంవత్సరాల్లో చైనీస్ ఎంబసీ ద్వారా పెద్ద మొత్తంలో నిధులు అందాయని అమిత్ షా తెలిపారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగే ప్రశ్నల జాబితాను చూశానని, దానిలోని ఐదో ప్రశ్నను చూసేసరికి కాంగ్రెస్ ఆత్రుత దేనికో అర్థమైపోయిందని అన్నారు. ఆర్జీఎఫ్‌కు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) ప్రకారం ఇచ్చిన అనుమతులను రద్దు చేయడం గురించి ఐదో ప్రశ్న ఉందన్నారు. కాంగ్రెస్ సభ్యులు తనకు అవకాశం ఇచ్చి ఉంటే, తాను ఆర్జీఎఫ్‌కు వచ్చిన నిధుల గురించి వివరించి ఉండేవాడినని తెలిపారు. 2005-2007 మధ్య కాలంలో ఈ ఫౌండేషన్‌కు చైనీస్ ఎంబసీ నుంచి రూ.1.35 కోట్లు వచ్చాయని చెప్పి ఉండేవాడినన్నారు. ఎఫ్‌సీఆర్ఏ ప్రకారం ఈ విధంగా నిధులను స్వీకరించడం సరికాదని చెప్పారు. నిబంధనల ప్రకారమే ఆర్జీఎఫ్‌కు అనుమతిని రద్దు చేసినట్లు తెలిపారు.
సాంఘిక సంక్షేమం కోసం కృషి చేస్తామని ఆర్‌జీఎఫ్‌ను రిజిస్టర్ చేయించారని, అందుకు విరుద్ధంగా భారత్-చైనా సంబంధాలపై పరిశోధన కోసం నిధులను వినియోగించారని తెలిపారు. చైనా అంటే మాజీ ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూకు చాలా ప్రేమ అని, అందుకే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత దేశానికి శాశ్వత సభ్యత్వాన్ని ఆయన వదులుకున్నారని ఆరోపించారు. వివాదాస్పద ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్ నుంచి రూ.50 లక్షలను ఆర్జీఎఫ్ 2011 జూలై 7న స్వీకరించిందన్నారు.