మళ్లీ పెరిగిన అమూల్ పాల ధర
ABN , First Publish Date - 2022-10-16T08:11:00+05:30 IST
అమూల్ పాల ధరలు మరోసారి పెరిగాయి. ఈ మేరకు గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఓ ప్రకటన చేసింది.
గుజరాత్‌కు మాత్రం మినహాయింపు
ఫుల్ క్రీం, గేదె పాల ధర రూ.2 పెంపు
అదేబాటలో మదర్ డెయిరీ..
న్యూఢిల్లీ, అక్టోబరు 15: అమూల్ పాల ధరలు మరోసారి పెరిగాయి. ఈ మేరకు గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఓ ప్రకటన చేసింది. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో మినహాయించి దేశవ్యాప్తంగా ఈ పెంపును వర్తింప చేసింది. ఫుల్ క్రీమ్, గేదె పాల ధరలను లీటరుకు రూ.2 పెంచుతున్నట్లు సంస్థ ఎండీ ఆర్‌ఎస్ సోథి పేర్కొన్నారు. డెయిరీ ఫ్యాట్ ధరలు బాగా పెరిగినట్లు ఎండీ వివరించారు. దీంతో మొన్నటి వరకూ లీటరు రూ.61 ఉండగా, తాజా పెంపుతో ధర రూ.63కు చేరింది. అమూల్ పాల ధరలను పెంచడం ఈ ఏడాదిలో ఇది మూడో సారి. మార్చిలో ఓ సారి పెంచిన అమూల్ రెండు నెలల క్రితం ఆగస్టులో గోల్డ్, శక్తి, తాజా బ్రాండ్ల ధరలను లీటరుకు రూ.2 పెంచింది. మరోవైపు మరో ప్రధానమైన డెయిరీ మదర్ డెయిరీ కూడా పాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఫుల్ క్రీమ్, ఆవు పాల ధరలు లీటరకు రూ.2 పెంచుతున్నట్లు తెలిపారు. ఆదివారం నుంచి పెంచిన రేట్లు అమల్లోకి వస్తాయని చెప్పారు.