Rajdhani Express : టీటీఈ క్షణికావేశం... కాళ్ళు కోల్పోయిన సైనికుడు...
ABN , First Publish Date - 2022-11-18T13:07:07+05:30 IST
క్షణికావేశం ఎన్నో అనర్థాలకు దారి తీస్తుందనడానికి ఓ ఉదాహరణగా ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలో జరిగిన దారుణాన్ని
బరేలీ (ఉత్తర ప్రదేశ్) : క్షణికావేశం ఎన్నో అనర్థాలకు దారి తీస్తుందనడానికి ఓ ఉదాహరణగా ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలో జరిగిన దారుణాన్ని చెప్పవచ్చు. రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ సైనికుడిని టీటీఈ తోసేయడంతో, ఆ సైనికుడు రెండు కాళ్ళను కోల్పోయి, స్పృహ లేని స్థితిలో ప్రాణాల కోసం ఆసుపత్రిలో పోరాడుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, డిబ్రుగర్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ (20503)లో ఎక్కేందుకు సోనూ కుమార్ సింగ్ (Sonu Kumar Singh-29) ప్రయత్నించారు. ఆయన 24 రాజ్‌పుఠానా రైఫిల్స్‌లో జవాన్‌గా, ప్రస్తుతం ఢిల్లీలో పని చేస్తున్నారు. ఢిల్లీ వెళ్లేందుకు ఆయన గురువారం ఉదయం 9.30 గంటలకు బరేలీ జంక్షన్‌లో ఈ రైలు ఎక్కేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న టీటీఈ (Travelling Ticket Examiner) కుపన్ బోరే ఆగ్రహంతో బోగీ (B6) తలుపును మూసేసి, సోనూను తోసేశారు. వెంటనే సోనూ రైలు, ప్లాట్‌ఫాం మధ్యలో పడిపోయారు. ఆయన ఒక కాలు అక్కడే ముక్కలైపోయింది. మరొక కాలును సైనిక ఆసుపత్రిలో శస్త్ర చికిత్స ద్వారా తొలగించారు. ఆయన స్పృహ లేని స్థితిలో ప్రాణాల కోసం పోరాడుతున్నారు.
బరేలీ జీఆర్‌పీ ఇన్‌ఛార్జి అజిత్ ప్రతాప్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, టీటీఈ కుపన్ బోరే రైలు నుంచి తోసేయడంతో ఓ ఆర్మీ జవాన్ తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. బరేలీ జంక్షన్‌లో రెండో నెంబరు ప్లాట్‌ఫాం వద్ద రాజధాని ఎక్స్‌ప్రెస్ వద్ద ఈ దారుణం జరిగిందన్నారు. ఆ సైనికుడి కాలు రైలు చక్రాల క్రిందకు వెళ్ళడంతో అది ముక్కలైపోయిందని, రెండో కాలును శస్త్ర చికిత్స ద్వారా తొలగించారని చెప్పారు.
సైనికుడిని రైలు నుంచి తోసేసి, ఆయన తీవ్రంగా గాయపడటానికి కారకుడైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీఈపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సుబేదార్ హరిందర్ కుమార్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్ఐఆర్‌ను నమోదు చేసినట్లు చెప్పారు. ప్రమాదకర ఆయుధాలు లేదా సాధనాలతో ఉద్దేశపూర్వకంగా గాయపరచినందుకు (ఐపీసీ సెక్షన్ 326), హత్యాయత్నం చేసినందుకు (ఐపీసీ సెక్షన్ 307) ప్రకారం ఈ కేసు నమోదు చేశామన్నారు. టీటీఈ పరారీలో ఉన్నారన్నారు. ఈ సంఘటనకు కారణాలేమిటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. బాధితుని ఆరోగ్యం మెరుగైన తర్వాత ఆయన స్టేట్‌మెంట్‌ను నమోదు చేస్తామన్నారు.
ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షి, టీ విక్రేత దేశ్ రాజ్ తెలిపిన వివరాల ప్రకారం, తాను టీ అమ్ముతున్న సమయంలో ఓ వ్యక్తి రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు బీ6 బోగీలో ఎక్కేందుకు ప్రయత్నించడం చూశానని చెప్పారు. అక్కడే ఉన్న టీటీఈ ఆ బోగీలోకి ప్రవేశించే మార్గానికి అడ్డుగా నిల్చుని, ఆ వ్యక్తిని తోసేశారని చెప్పారు. కదులుతున్న రైలుకు, ప్లాట్‌ఫాంకు మధ్యలో ఆ వ్యక్తి పడిపోయారని చెప్పారు. వెంటనే కొందరు వ్యక్తులు పెద్దగా కేకలు వేయడంతో రైలును డ్రైవర్ ఆపారని చెప్పారు. క్రింద పడిపోయిన వ్యక్తిని బయటకు తీశారని, అప్పటికే ఆయన స్పృహ కోల్పోయారని తెలిపారు. ఆ వ్యక్తి సైనికుడని తమకు తెలిసిందన్నారు. అక్కడే ఉన్న కొందరు ఓ రైల్వే ఉద్యోగిపై దాడి చేశారన్నారు. అతనిని రైల్వే పోలీసులు కాపాడారని చెప్పారు.