Shallow Earthquake : భూకంపం తీవ్రత తక్కువే, కానీ కొట్టే దెబ్బ తీవ్రం

ABN , First Publish Date - 2022-11-23T17:05:38+05:30 IST

కొన్ని భూకంపాలను పరిశీలించినపుడు భూకంప లేఖిని (Richter Scale)పై చూస్తే చాలా తక్కువ తీవ్రత కనిపిస్తుంది.

Shallow Earthquake : భూకంపం తీవ్రత తక్కువే, కానీ కొట్టే దెబ్బ తీవ్రం
Earthquakes

న్యూఢిల్లీ : కొన్ని భూకంపాలను పరిశీలించినపుడు భూకంప లేఖిని (Richter Scale)పై చూస్తే చాలా తక్కువ తీవ్రత కనిపిస్తుంది. కానీ ఆ భూకంపం వల్ల ప్రజలకు తగిలే దెబ్బ విపరీతంగా ఉంటుంది. ఇటువంటి అనుభవం తాజాగా ఇండోనేషియాలోని జావా దీవి ప్రజలకు ఎదురైంది. కేవలం 5.6 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల 260 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పాఠశాలలు, ఆసుపత్రి, ఇతర భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొలబద్దపై కనిపించినదానికి భిన్నంగా వాస్తవ నష్టం జరగడానికి కారణాలేమిటి?

భూకంపం వల్ల జరిగే నష్టం కేవలం దాని తీవ్రతపై ఆధారపడదు. జనావాసాలు ఆ భూకంప భ్రంశ రేఖకు ఎంత దగ్గరగా ఉన్నాయి? కంపనం ఎంత లోతులో సంభవించింది? భూకంపం నుంచి రక్షణ పొందే పద్ధతిలో భవనాల నిర్మాణం జరిగిందా? వంటి అంశాలను బట్టి నష్టం జరుగుతుంది.

ఇండోనేషియా, యోగ్యకర్త, యూనివర్సిటాస్ గడ్జాహ్ మడలోని అసిస్టెంట్ జియాలజీ ప్రొఫెసర్ గాయత్రి మర్లియాని మాట్లాడుతూ, భూకంపం మధ్యంతర స్థాయిలో ఉన్నప్పటికీ, భూమి ఉపరితలానికి సమీపంలో, సముద్రాలకు దూరంగా, జనావాసాలకు దగ్గరగా ఏర్పడితే, చెప్పుకోదగ్గ స్థాయిలో నష్టం కలిగించే శక్తి దానికి ఉంటుందని తెలిపారు. భూమి అడుగున ఉండే శిలలో పెద్ద చీలిక ఉన్న ప్రాంతంలో భూమి ఉపరితలం రూపొందుతుందని, భూకంపం సంభవించినపుడు ఈ శిల ఒకవైపు నుంచి మరొకవైపునకు జారుతుందని చెప్పారు. జావా ద్వీపంలో సంభవించిన భూకంపం ప్రాంతం అత్యధికంగా ఇటువంటి ప్రదేశంలోనే ఉందన్నారు. ఇటువంటి చీలికలుగల కొన్ని ప్రాంతాల గురించి బాగా తెలిసినప్పటికీ, మరికొన్నిటిపై సరైన అధ్యయనం జరగలేదన్నారు.

భూకంపం నుంచి రక్షణ పొందే డిజైన్‌లో భవనాలను నిర్మించుకోవడం వల్ల సత్ఫలితాలు ఉంటాయని కొందరు నిపుణులు చెప్తున్నారు. జావాలో సంభవించిన భూకంపం వల్ల నష్టం పెరగడానికి కారణం అక్కడి భవనాలను ఇటువంటి డిజైన్లలో నిర్మించకపోవడమేనని తెలిపారు.

పసిఫిక్ బేసిన్‌లో అగ్ని పర్వతాలు, భూమి లోపలి పొరల్లోని శిలలు పగిలిపోయిన ప్రాంతాలు ఎక్కువగా గల చోట ఇండోనేషియా దేశం ఉంది. ఇక్కడ సుమారు 27 కోట్ల మంది జీవిస్తున్నారు. దాదాపు 40 వేల కిలోమీటర్ల మేరకు విస్తరించిన ఈ ప్రాంతంలో భూకంపాలు తరచూ సంభవిస్తాయి. అయితే చాలా భూకంపాలు స్వల్ప తీవ్రతతో కనిపిస్తాయి. వాటి వల్ల జరిగే నష్టం చాలా స్వల్పంగా ఉంటుంది. కొన్నిసార్లు అసలు నష్టం ఏమీ ఉండదు. 2004లో హిందూ మహా సముద్రంలో ఏర్పడిన సునామీ వల్ల అనేక దేశాలకు చెందిన సుమారు 2,30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అత్యధికులు ఇండోనేషియాకు చెందినవారే.

Updated Date - 2022-11-23T17:05:44+05:30 IST