New Year Resolution : ఈ నాలుగు మాటలు ఒంటబట్టించుకుంటే మీరే విజేత : ‘ఆపిల్’ బాస్ టిమ్ కుక్
ABN , First Publish Date - 2022-12-27T18:26:07+05:30 IST
కేలండర్‌లో కొత్త సంవత్సరం రాబోతోందంటే చాలు ఎన్నెన్నో చేయాలని నిర్ణయాలు, తీర్మానాలు చేసుకునేవారు చాలా మంది కనిపిస్తారు.
న్యూఢిల్లీ : కేలండర్‌లో కొత్త సంవత్సరం రాబోతోందంటే చాలు ఎన్నెన్నో చేయాలని నిర్ణయాలు, తీర్మానాలు చేసుకునేవారు చాలా మంది కనిపిస్తారు. మరో కొత్త సంవత్సరం వచ్చేసరికి వీటిలో ఒకదాన్నయినా సాధించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేసేవాళ్ళు కూడా మనకు కనిపిస్తారు. అలాంటివారికి ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ (Apple CEO Tim Cook) ఓ సలహా ఇచ్చారు. నాలుగు మాటలు తెలుసుకుని, ఆచరిస్తే చాలు ఇక మీదే విజయం అని ఢంకా బజాయించి చెప్పారు. దాదాపు ఏడేళ్ళ క్రితం ఆయన మన దేశంలో పర్యటించినపుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సూచన చేశారు.
‘‘మీరు వ్యక్తిగతంగా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన, భారతీయ యువతకు తెలియజేయాలని మీరు భావిస్తున్న మూడు అంశాలను చెప్పండి’’ అని అడిగినపుడు టిమ్ కుక్ స్పందిస్తూ, నాలుగు మాటలు తెలిస్తే చాలు విజేతలవుతారని చెప్పారు.
‘నీకు ఇష్టమైనదానినే చెయ్యి’
నీకు ఇష్టమైనదానినే చెయ్యి (Do what you love) అనే నాలుగు మాటలు తెలిసి, ఆచరిస్తే జీవితంలో కచ్చితంగా విజయం సాధిస్తారని టిమ్ కుక్ చెప్పారు. ‘నీకు ఇష్టమైనదానినే చెయ్యి, నీ మనసంతా దానిపైనే లగ్నం చెయ్యి, ఆ తర్వాత ఆనందించు’ అని చెప్పారు.
పని చేయడంలో అనుసరించే సంప్రదాయ ఆలోచనా ధోరణికి ఈ మాటలు విరుద్ధంగా కనిపిస్తాయి. అవసరమైన వస్తువులను కొనడానికి, బిల్లులను చెల్లించడానికి, పిల్లలను పాఠశాలలు, కళాశాలల్లో చేర్పించడం కోసం డబ్బు సంపాదించడం, రిటైర్‌మెంట్ ప్లాన్స్ కోసం సంప్రదాయ రీతిలో పని చేయడానికి టిమ్ కుక్ చేసిన సూచన విరుద్ధంగా కనిపిస్తుంది. మనలో చాలా మంది మనకు ప్రస్తుతం లభిస్తున్న జీతాలు, ఆరోగ్య ప్రయోజనాలు, ఉద్యోగ భద్రత వంటివాటి పట్ల సంతృప్తి చెందుతూ ఉంటాం. మనకు మన బాస్‌లపై ఇష్టం లేకపోయినా, మనం ఇష్టపడేదాన్ని కాకుండా వేరొక పనిని చేస్తున్నా, ప్రస్తుత ఉద్యోగాల్లోనే కొనసాగుతూ ఉంటాం.
‘‘మీకు నా సలహా ఏమిటంటే, డబ్బు కోసం పని చేయకండి. అలా చేయడం నిష్ప్రయోజనమతుంది. లేని పక్షంలో సరిపడినంత డబ్బు సంపాదించలేరు. మీరు ఎన్నడూ సంతోషంగా ఉండలేరు’’ అని టిమ్ కుక్ గతంలో గ్లాస్గో విశ్వవిద్యాలయం విద్యార్థులతో చెప్పారు. మీరు బలంగా కోరుకునేదాన్ని చేయడం, అదే సమయంలో, ఇతరులకు సేవ చేయడం, ఈ రెండిటి మధ్య ఇరుసు (Intersection)ను మీరు గుర్తించాలని చెప్పారు. దానిని మీరు గమనించలేకపోతే మీరు జీవితంలో సంతోషంగా ఉండలేరని చెప్పారు. లాభాలు, ఆదాయం కోసం ఏదో ఓ పనిని ప్రేమించడానికి, ఇతరులకు సేవ చేయడాన్ని ప్రేమించడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు.
మిమ్మల్ని మీరు మరీ తీవ్రంగా పరిగణించుకోకపోవడానికి, సరదాగా గడపడానికి ఎంతో విలువ ఉంటుందన్నారు. ఇది మీ జట్టు ఎక్కువ ఉత్పాదకతను సాధించడానికి, అంతేకాకుండా చేసే పనిలో ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా నిమగ్నమయ్యేలా చేయడానికి దోహదపడుతుందన్నారు. వీటన్నిటితోపాటు మనం 2020 నుంచి అనిశ్చిత పరిస్థితుల్లో గడుపుతున్నామన్నారు. ఇటువంటి సమయంలో సరదాగా గడపడమంటే మన జట్టు సభ్యులను, కస్టమర్లను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి, సామాజిక స్ఫూర్తితో ఇతరులతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి అవకాశాలను సృష్టించుకోవడమేనని చెప్పారు. ఒకరికొకరు శాశ్వతంగా నిలిచే స్నేహ సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. చిట్టచివరికి ఇదంతా గొప్ప వ్యాపార వ్యూహమని రుజువవుతుందని తెలిపారు.