arrangement: పంద్రాగస్టు వేడుకలకు భారీ బందోబస్తు

ABN , First Publish Date - 2022-08-12T13:07:56+05:30 IST

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా మునుపెన్నడూ లేనంతగా 1.20లక్షల మంది పోలీసులతో భద్రతాఏర్పాట్లు చేపడుతున్నారు.

arrangement: పంద్రాగస్టు వేడుకలకు భారీ బందోబస్తు

- 1.20లక్షల మంది పోలీసులతో భద్రత

- రాయబార కార్యాలయాలకు అదనపు రక్షణ


చెన్నై, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా మునుపెన్నడూ లేనంతగా 1.20లక్షల మంది పోలీసులతో భద్రతాఏర్పాట్లు చేపడుతున్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్‌ విభాగం హెచ్చరికల నేపథ్యంలో స్వాతంత్య్ర వేడుకలు(Independence celebrations) జరుగనున్న సెయింట్‌ జార్జి కోట వద్ద పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. గ్రేటర్‌ చెన్నై పోలీసుకమిషనర్‌ శంకర్‌ జివాల్‌ పర్యవేక్షణలో నలుగురు అదనపు పోలీసు కమిషనర్లు, ఏడుగురు డిప్యూటీ పోలీసు కమిషనర్లు, 25 మంది అసిస్టెంట్‌ పోలీసు కమిషనర్లు, 22 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. కరోనా లాక్‌డౌన్‌(Corona Lockdown) కారణంగా రెండేళ్లపాటు ఈ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. ప్రస్తుతం గతంలా అత్యంత వైభవంగా ఈ వేడుకలను నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది. ఇప్పటికే సెయింట్‌ జార్జి కోట వద్ద వివిధ పోలీసు దళాలు, మహిళా కమెండోలు, త్రివిధ దళాల(Three forces) ఆధ్వర్యంలో కవాతు ప్రదర్శనల రిహార్సల్స్‌ జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వృద్ధులు, చిన్నారులు మినహా ప్రజలందరిని అనుమతించనున్నారు. భారీ యెత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకల సందర్భంగా తీర ప్రాంతాల్లో భద్రతా దళం నిఘా వేస్తోంది. గస్తీ నౌకల్లో సముద్రతీర భద్రతాదళం అధికారులు రేయింబవళ్లు సంచరిస్తున్నారు. ఇదే విధంగా కల్పాక్కం, కూడన్‌కుళం అణువిద్యుత్‌ కేంద్రాల వద్ద కూడా భద్రత కట్టుదిట్టం చేశారు. రాష్ట్రంలో ప్రధాన బస్‌స్టేషన్లు ఉన్న చెన్నై(Chennai) కోయంబేడు, మదురై, తిరుచ్చి, తిరునల్వేలి, కోయంబత్తూరు నగరాల్లో సాయుధ దళాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సెంట్రల్‌ , ఎగ్మూరు, తాంబరం రైల్వేస్టేషన్లలో కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇక నగరంలో లాడ్జిలు, మేన్షన్‌లు, హోటళ్లలో బసచేస్తున్నవారిపై కూడా పోలీసులు నిఘా వేస్తున్నారు. రాత్రి బసచేసేందుకు వచ్చినవారి వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. రోడ్లపై రాత్రివేళల్లో అనుమానాస్పదంగా సంచరించేవారిని నిర్బంధించి పోలీసుస్టేషన్లకు తీసుకెళ్ళి  విచారణ జరిపినమీదటే విడిచిపెడుతున్నారు.


ఎంబసీలకు భద్రత...

నగరంలో విదేశీ రాయబార కార్యాలయాల వద్దకూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. అన్నాసాలైలోని అమెరికా రాయబార కార్యాలయం, నుంగంబాక్కంలోని బ్రిటన్‌ రాయబార కార్యాలయం, శ్రీలంక(Sri Lanka) రాయబార కార్యాలయం, టి.నగర్‌ జీఎన్‌ చెట్టి రోడ్డులోని సింగపూర్‌ రాయబార కార్యాలయం తదితర రాయబార కార్యాలయాల వద్ద సాయుధులైన పోలీసులు కాపలా కాస్తున్నారు. ఈ  కార్యాలయాల ప్రవేశ ద్వారాల వద్ద పోలీసులు బారీకేడ్లను కూడా ఏర్పాటు చేశారు.  

Updated Date - 2022-08-12T13:07:56+05:30 IST