Special Story: ఒక్క గన్‌తో 3 వేల మంది పాక్ సైనికులకు జవాబు

ABN , First Publish Date - 2022-12-21T21:02:00+05:30 IST

ప్రాణాలకు తెగించి పోరాడిన ఇలాంటి జవాన్లకు భారత జాతి ఎప్పటికీ రుణపడి ఉంటుంది.

Special Story: ఒక్క గన్‌తో 3 వేల మంది పాక్ సైనికులకు జవాబు
Bhairon Singh Rathore

1971 డిసెంబర్ 5

రాజస్థాన్ థార్ ఎడారి లోని లోంగేవాలాలో ఉన్న భారత సరిహద్దు పోస్టుపై పాక్ బలగాల దాడి

భారత్‌ను వ్యూహాత్మకంగా దెబ్బతీయాలని సరిహద్దు అవతల నుంచి కుట్ర పన్నిన పాక్ సైన్యం

దాదాపు 3 వేల మంది పాక్ సైనికులు రాత్రివేళలో 40 ట్యాంకర్లు, వందలాది వాహనాలతో దాడి

లోంగేవాలా పోస్ట్ వద్ద 120 మంది జవాన్లు మాత్రమే

పంజాబ్ రెజిమెంట్‌కు చెందిన టీమ్‌తో ఆరుగురు బీఎస్ఎఫ్ జవాన్లు

ఈ యూనిట్‌లోనే లాన్స్ నాయక్ భైరోన్‌ సింగ్‌ రాథోడ్

మేజర్ కుల్దీప్ సింగ్ చంద్రపురి, కెప్టెన్ ధరమ్‌వీర్ భారత జవాన్లకు సారథ్యం వహించారు. భారత సైనికుల్లో స్ఫూర్తి నింపి ధైర్యం కోల్పోవద్దని, తుదిదాకా పోరాడాలని సూచించారు. ఒక బంకర్ నుంచి మరో బంకర్‌కు ముందుకు వెళ్లేలా చేస్తూ పాక్ సైనికులను ఎదుర్కొనేలా జవాన్లను ప్రోత్సహించారు. మరిన్ని భారత సేనలు, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలు చేరుకునేవరకూ మన జవాన్లు పాక్ సేనలను నిలువరించారు. ఈ క్రమంలో పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో పంజాబ్ రెజిమెంట్‌ జవాన్ ఒకరు మరణించడంతో లాన్స్ నాయక్ భైరోన్‌ సింగ్‌ రాథోడ్ లైట్ మిషన్ గన్ తీసుకుని పాక్ సేనలవైపు దూసుకుపోయారు. విజయమో, వీర స్వర్గమో అంటూ ఆయన పాక్ సేనల వైపు దూసుకెళ్లడం చూసి మిగతా జవాన్లలోనూ తెగింపు వచ్చింది. అందరూ కలిసి పాక్ సేనలపై విరుచుకుపడ్డారు. భారత జవాన్ల కాల్పుల్లో అనేక మంది పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కొద్దిమంది భారత జవాన్లు వేల మంది పాక్ సైనికులను నిలువరించడంలో విజయవంతమయ్యారు.

ఇంతలో ఫినిషింగ్ టచ్‌లా భారత వాయుసేన రంగంలోకి దిగింది. చీకట్లో దాడులు చేయగలిగే శక్తి సామర్థ్యాలు నాడు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు లేకపోవడంతో తెల్లవారేవరకూ ఎదురుచూశారు. తెలవారుతుండగానే భారత యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. హంటర్ విమాన దాడుల్లో మొత్తం 22 పాక్ యుద్ధ ట్యాంకులు ధ్వసమయ్యాయి. చివరకు పాక్ సేనలు తోకముడిచాయి. విజయం భారత్ సొంతమైంది.

పాకిస్తాన్ షెర్మాన్ యుద్ధ ట్యాంకులు, టీ59 చైనీస్ యుద్ధ ట్యాంకులు, పాక్ వాహనాలు ఇసుకతో కూడిన థార్ ఎడారిలో కూరుకుపోయాయి. ముందుకు సాగలేకపోయాయి. యుద్ధ ట్యాంకులు, వాహనాలు ఇసుకలో దిగబడిపోవడంతో బయటపడే ప్రయత్నంలో ఇంజన్లు వేడెక్కి విఫలమవడంతో పాక్ సైనికులు వాటిని విడిచి పెట్టాల్సి వచ్చింది. దీనికి తోడు భారత వాయుసేన విమానాలు దాడి చేస్తాయని పాక్ సైన్యం అంచనా వేయలేకపోయింది. అంతేకాదు తమ దేశానికి చెందిన ఎయిర్‌ఫోర్స్ సాయం కూడా పాక్ సేనలకు లభించలేదు.

భారత సైన్యం వ్యూహాత్మకంగా వ్యవహరించి వీరోచితంగా పోరాడటంతో 200 మంది పాక్ సైనికులు హతమయ్యారు. 36 పాక్ ట్యాంకులు ధ్వంసమయ్యాయి. వందలాది వాహనాలను కూడా పాక్ కోల్పోయింది.

నాటి విజయంలో కీలక పాత్ర పోషించిన మేజర్ కుల్దీప్ సింగ్ చంద్రపురికి మహా వీర్ చక్ర, లాన్స్ నాయక్ భైరాన్ సింగ్ రాథోడ్‌కు సేవా పతకం లభించాయి. భైరాన్ సింగ్ రాథోడ్‌ 1987లో నాయక్‌గా రిటైరయ్యారు. మేజర్ కుల్దీప్ సింగ్ ఆ తర్వాత బ్రిగేడియర్ అయ్యారు.

లోంగేవాలాలో పాక్ సైన్యాన్ని చిత్తుగా ఓడించిన నేపథ్యంతో 1997లో జేపీ దత్తా దర్శకత్వంలో హిందీలో బార్డర్ సినిమా తీశారు. సన్నీ డియోల్ చంద్రపురి పాత్ర పోషించగా లాన్స్ నాయక్ భైరాన్ సింగ్ రాథోడ్ పాత్రను సునీల్ శెట్టి పోషించారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

81 సంవత్సరాల వయసులో ఈ నెల 19న భైరాన్ సింగ్ రాథోడ్ జోథ్‌పూర్‌లో కన్నుమూశారు. భైరాన్ సింగ్ రాథోడ్ లాంటి వీరజవాన్ల కారణంగా ఇండియన్ ఆర్మీ అనేక విజయాలను సాధించింది. ప్రాణాలకు తెగించి పోరాడిన ఇలాంటి జవాన్లకు భారత జాతి ఎప్పటికీ రుణపడి ఉంటుంది.

Updated Date - 2022-12-21T21:02:11+05:30 IST