Chennai Sangamam: పదేళ్ల తర్వాత మళ్ళీ ‘చెన్నై సంగమం’
ABN , First Publish Date - 2022-12-31T11:05:36+05:30 IST
పదేళ్ల విరామం తర్వాత నగరంలో ‘చెన్నై సంగమం’(Chennai Sangamam) వేడుకలు జరుగనున్నాయి. 2007లో సంక్రాంతి పండుగ సం
- నగరంలో 16 చోట్ల గ్రామీణ కళారూపాల ప్రదర్శన
చెన్నై, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): పదేళ్ల విరామం తర్వాత నగరంలో ‘చెన్నై సంగమం’(Chennai Sangamam) వేడుకలు జరుగనున్నాయి. 2007లో సంక్రాంతి పండుగ సందర్భంగా నగరంలోని ఉద్యానవనాలు, మైదానాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన జానపదకళాకారులను రప్పించి గ్రామీణ వాద్యకారులతో మైలాట్టం, గరగాట్టం, ఒయిల్ ఆట్టం వంటి నృత్య ప్రదర్శనలు, డప్పువాయిద్యాలతో సాంస్కృతి పండుగ నిర్వహించేవారు. డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలకు నగర వాసుల నుంచి విశేష స్పందన రాగా, జానపద కళాకారులకు ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం కూడా లభించేది. 2011లో అన్నాడీఎంకే ప్రభుత్వం అధికారంలోకి రావటంతో ఈ వేడుకలకు స్వస్తి పలికారు. పదేళ్ల తర్వాత డీఎంకే మళ్ళీ అధికారంలోకి రావటంతో ఈ సంక్రాంతికి మళ్ళీ చెన్నై సంగమం వేడుకలను భారీయెత్తున నిర్వహించేందుకు కనిమొళి సిద్ధమయ్యారు. ఆ మేరకు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ మేయర్ ప్రియ, డిప్యూటీ మేయర్ మహే్‌షకుమార్ అధికారులతో కలిసి ఈ వేడుకలను నిర్వహించేందుకు అనువైన ఉద్యానవనాలు, మైదానాలు ఎంపిచేయడంలో నిమగ్నమయ్యారు. జనవరి 14 నుంచి 16 వరకు మూడు రోజులపాటు సాయంత్రం నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు కనిమొళి తెలిపారు. శుక్రవారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ.. కొళత్తూరు వద్దనున్న కార్పొరేషన్ మైదానం, రాయపురంలోని రాబిన్‌సన్ క్రీడా మైదానం, మైలాపూరులోని దేశోద్ధారక నాగేశ్వరరావు పార్క్, అన్నాసాలై జెమినీ బ్రిడ్జీ సమీపంలో ఉన్న సెమ్మొళి పార్కు, నుంగంబాక్కం టెన్సీస్ మైదానం, అన్నానగర్ టవర్ పార్కు,, బిసెంట్ నగర్ ఎలియట్స్ బీచ్, తిరువాన్మియూరు బీచ్, టి. నగర్ నటేశన్ పార్కు, వలసరవాక్కం రామకృష్ణ నగర్ మైదానం సహా 16 చోట్ల ఈ వేడుకలు నిర్వహించనున్నామని చెప్పారు. ఈ వేడుకలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) ప్రారంభిస్తారన్నారు. ఈ వేడుకలు జరిగే ప్రతిచోటా గ్రామీణ వంటకాలతో ‘ఫుడ్ ఫెస్టివల్’ కూడా నిర్వహిస్తామన్నారు. ఈ వేడుకల కోసం ప్రత్యేకమైన వేదికలు నిర్మించి ప్రేక్షకులకు శుభ్రమైన మంచీనీరు, సంచార మరుగుదొడ్లు తదితర సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ వేడుకలను నిర్వహించేందుకుగాను మంత్రులు తంగం తెన్నరసు, రామచంద్రన్ తదితరులతో కలిసి ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటవుతుందని కనిమొళి వివరించారు.