CM Nitish Kumar : నితీశ్‌ చూపు.. ఢిల్లీ వైపు!

ABN , First Publish Date - 2022-12-14T01:22:56+05:30 IST

ప్రధాని పీఠమెక్కాలన్న ఆకాంక్ష బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ ప్రతి అడుగులోనూ కనిపిస్తోంది. రేసులో తాను లేనని ఆయన పదే పదే చెబుతున్నా.. ఆయన ఎత్తుగడలు మాత్రం హస్తిన దిశగానే ఉన్నాయి.

CM Nitish Kumar : నితీశ్‌ చూపు.. ఢిల్లీ వైపు!

ప్రధాని పదవే లక్ష్యంగా అడుగులు!.. విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే వ్యూహం!

ఆర్‌జేడీతో పూర్తి స్థాయిలో మైత్రి

సీఎం పీఠం తేజస్వి యాదవ్‌కే

2025 ఎన్నికల సారథ్యమూ ఆయనకే

ఏ రేసులో లేనంటూనే బీజేపీ ఓటమే లక్ష్యమని ప్రకటన

ప్రధాని పీఠమెక్కాలన్న ఆకాంక్ష బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ ప్రతి అడుగులోనూ కనిపిస్తోంది. రేసులో తాను లేనని ఆయన పదే పదే చెబుతున్నా.. ఆయన ఎత్తుగడలు మాత్రం హస్తిన దిశగానే ఉన్నాయి. కాంగ్రెసేతర విపక్షాల్లో ప్రధాని పదవిపై మక్కువ పెంచుకున్న వారిలో బెంగాల్‌ సీఎం, టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ప్రథమ స్థానంలో ఉన్నారు. నితీశ్‌తోపాటు ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌, సీఎం కేసీఆర్‌, ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ సైతం రేసులో ఉన్నారు. మమత, కేసీఆర్‌, కేజ్రీవాల్‌ కాంగ్రెస్‌ ఆధిపత్యాన్ని అంగీకరించరు. నితీశ్‌ మాత్రం ఎంతో లోతుగా ఆలోచించే కాంగ్రె్‌సకు సన్నిహితంగా మెలుగుతున్నారు. బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఆర్‌జేడీ, కాంగ్రెస్‌, వామపక్షాలతో చేతులు కలిపి మళ్లీ మహాకూటమి సారథిగా ఆయన బిహార్‌ పగ్గాలు చేపట్టారు. తర్వాత నేరుగా సోనియా, రాహుల్‌తో మంతనాలు జరిపి.. ఒకప్పటి రాజకీయ శత్రువైన ఆర్‌జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌తో తిరిగి సయోధ్య కుదుర్చుకోవడం వెనుక పూర్తిగా రాజకీయ కోణమే ఉంది. విపక్షాలన్నిటినీ ఏకతాటిపైకి తీసుకురాగల సామర్థ్యం ఆయనకు ఉంది. ఇదే సమయంలో ప్రధాని పదవికి పలు పార్టీల నేతలు రేసులో ఉన్నారు. అయితే వారికి పరస్పరం పొసగని నేపథ్యంలో ‘ఏకాభిప్రాయ’ అభ్యర్థిగా అందరూ తన వైపు మొగ్గుచూపుతారని నితీశ్‌ గట్టి ఆశాభావంతో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే తన అభ్యర్థిత్వాన్ని మిగతా పార్టీలు పరిశీలనలోకి తీసుకోవాలంటే బిహార్‌లో తాను బలోపేతం కావాలి. అంటే జేడీయూ, ఆర్‌జేడీ మైత్రి మరింత పటిష్ఠం కావాలి. లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సంపాదించాలి. అందుకే దూరం ఆలోచించి.. 2025లో బిహార్‌ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో లాలూ వారసుడైన తేజస్వి మహాకూటమికి సారథ్యం వహిస్తారని మంగళవారం ప్రకటించి రాజకీయ వర్గాలను విస్మయపరిచారు. జేడీయూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన ఆయన.. ఇక తాను సీఎం అభ్యర్థిగా ఉండనన్నారు. ప్రధాని రేసులోనూ లేనన్నారు. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలన్న లక్ష్యం మాత్రం ఉందన్నారు.

ఉద్దేశమిదే..!

ప్రధాని పదవికి పోటీదారుల్లో లేనని నితీశ్‌ స్పష్టం చేసినా.. ఈ మాటలోనే ఆయన రాజకీయ వ్యూహం బయటపడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. సొంత పార్టీ జేడీయూ నేతలను కాకుండా.. తేజస్విని తన వారసుడిగా ప్రకటించడం ద్వారా ఆయన రెండు లక్ష్యాలు సాధించదలిచారని అంటున్నారు. మొదటిది.. ఆర్‌జేడీ నేతలను ప్రసన్నం చేసుకుని.. లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ-ఆర్‌జేడీ పొత్తును కొనసాగించడం.. ప్రధాని పదవికి ఆర్‌జేడీ మద్దతు పొందడం. గోవాలో, ఈశాన్య రాష్ట్రాల్లో తమ పార్టీని మింగేసిన మమతపై కాంగ్రెస్‌ అఽధిష్ఠానం గుర్రుగా ఉంది. సీనియర్‌ నాయకుడైన పవార్‌పైనా కాంగ్రె్‌సకు అపనమ్మకం. ఇక కేజ్రీవాల్‌ కాంగ్రె్‌సను ఎక్కడికక్కడ దెబ్బకొడుతున్నారు. దేశంలో తానే పెద్ద పార్టీ కాబట్టి మిగతా విపక్షాలు తననే బలపరచాలన్నది కాంగ్రెస్‌ అధిష్ఠానం ఉద్దేశమని.. అయితే రాహుల్‌ను తమ సారథిగా అంగీకరించేందుకు ఎవరూ సుముఖంగా లేరని విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెసే తన పేరును ప్రతిపాదిస్తుందని నితీశ్‌ అంచనా వేస్తున్నారు.

సెంట్రల్‌ డెస్క్‌.

Updated Date - 2022-12-14T07:55:33+05:30 IST