Currency notes : కరెన్సీ నోట్లపై మరో బొమ్మను సూచించిన కాంగ్రెస్

ABN , First Publish Date - 2022-10-27T12:47:14+05:30 IST

కరెన్సీ నోట్లపై బొమ్మల ముద్రణపై చర్చ మరింత విస్తృతమవుతోంది. వీటిపై లక్ష్మీ దేవి, విఘ్నేశ్వరుడుల

Currency notes : కరెన్సీ నోట్లపై మరో బొమ్మను సూచించిన కాంగ్రెస్
manish tewari arvind kejriwal

చండీగఢ్ : కరెన్సీ నోట్లపై బొమ్మల ముద్రణపై చర్చ మరింత విస్తృతమవుతోంది. వీటిపై లక్ష్మీ దేవి, విఘ్నేశ్వరుడుల బొమ్మలను ముద్రించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కోరిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ (Manish Tewari) స్పందిస్తూ, కరెన్సీ నోట్లపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar) బొమ్మను ఎందుకు ముద్రించకూడదని ప్రశ్నించారు.

అరవింద్ కేజ్రీవాల్ బుధవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, కొత్తగా ముద్రించే కరెన్సీ నోట్లపై లక్ష్మీ దేవి, విఘ్నేశ్వరుడుల బొమ్మలను ముద్రించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)కి లేఖ రాస్తానని చెప్పారు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, దేవుళ్ళ ఆశీర్వాదాలు మనకు లేకపోతే, కొన్నిసార్లు సత్ఫలితాలు రావని చెప్పారు.

ఈ నేపథ్యంలో మనీష్ తివారీ గురువారం ఇచ్చిన ట్వీట్‌లో, కొత్త సిరీస్ కరెన్సీ నోట్లపై డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఫొటో ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. నోటుకు ఒకవైపు ఘనతవహించిన మహాత్మా గాంధీ బొమ్మ, మరో వైపు డాక్టర్ అంబేద్కర్ బొమ్మ ఉండాలన్నారు. అహింస, రాజ్యాంగవాదం, సర్వసమానత్వం విశిష్ట సమ్మేళనంలో లీనమవుతాయన్నారు. అలాంటపుడు ఆధునిక భారతీయ బుద్ధి కుశలత అత్యంత కచ్చితమైన రీతిలో వ్యక్తమవుతుందన్నారు.

కేజ్రీవాల్ డిమాండ్‌పై పంజాబ్ కాంగ్రెస్ శాఖ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా స్పందిస్తూ, గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీసేందుకు పోటీతత్త్వంతో కూడిన హిందుత్వాన్ని కేజ్రీవాల్ ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.

Updated Date - 2022-10-27T12:47:20+05:30 IST