Himachal Pradesh Assembly elections: కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో భారీ తాయిలాలు

ABN , First Publish Date - 2022-11-05T14:43:23+05:30 IST

హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల కోసం మేనిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది. విజయమే లక్ష్యంగా అనేక రాయితీలను,

Himachal Pradesh Assembly elections: కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో భారీ తాయిలాలు
Himachal Pradesh Congress Election Manifesto

న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల కోసం మేనిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది. విజయమే లక్ష్యంగా అనేక రాయితీలను, భారీ తాయిలాలను వాగ్దానం చేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తే మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున చెల్లిస్తామని తెలిపింది. ప్రభుత్వోద్యోగులకు పాత పింఛను పథకాన్ని పునరుద్ధరిస్తామని తెలిపింది. ఈ రాష్ట్రంలో నవంబరు 12న ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి. డిసెంబరు 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

సిమ్లాలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ ఇన్‌ఛార్జి రాజీవ్ శుక్లా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్, ఆ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ సుఖ్విందర్ సింగ్ సుఖు, పీసీసీ ప్రెసిడెంట్ ప్రతిభ సింగ్ ఈ ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు.

శుక్లా మాట్లాడుతూ, హిమాచల్ ప్రదేశ్‌లో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఈ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన వాగ్దానాలన్నిటినీ నెరవేర్చుతామని చెప్పారు. ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చే సంప్రదాయం తమ పార్టీకి ఉందన్నారు. తమ పార్టీ అంటే బీజేపీ వంటిది కాదన్నారు. బీజేపీ మొదట వాగ్దానాలిస్తుందని, ఆ తర్వాత తుంగలో తొక్కుతుందని చెప్పారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత జరిగే తొలి మంత్రివర్గ సమావేశంలో 1 లక్ష ప్రభుత్వోగాలను భర్తీ చేయడానికి నిర్ణయం తీసుకుంటామన్నారు. వృద్ధాప్య పింఛనును పెంచుతామని, 75 ఏళ్ళ వయసు పైబడినవారికి ప్రత్యేక సాంఘిక భద్రత పింఛనును ఇస్తామన్నారు.

ఎన్నికల ప్రణాళిక (Manifesto)లో కాంగ్రెస్ చేసిన వాగ్దానాల్లో ముఖ్యమైనవి ఏమిటంటే,

- ప్రభుత్వోద్యోగులకు పాత పింఛను పథకం పునరుద్ధరణ

- ఒక్కొక్క కుటుంబానికి నెలకు 300 యూనిట్ల వరకు విద్యుత్తు ఉచితం

- 18 నుంచి 60 ఏళ్ళ మధ్య వయస్కులైన మహిళలకు ఒక్కొక్కరికి నెలకు రూ.1,500 ఆర్థిక సాయం

- 1 లక్ష ప్రభుత్వోద్యోగాల భర్తీ

- ప్రతి గ్రామంలోనూ సంచార వైద్య శాలల ఏర్పాటు

- యువత కోసం స్టార్టప్ ఫండ్ ఏర్పాటు. ప్రతి శాసన సభ నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున కేటాయింపు.

- పర్యాటక రంగ అభివృద్ధి కోసం స్మార్ట్ విలేజ్ ప్రాజెక్టు ఏర్పాటు.

Updated Date - 2022-11-05T14:43:27+05:30 IST