Kejriwal Government: డీటీసీ బస్సుల కొనుగోళ్లలో అక్రమాలు... సీబీఐ దర్యాప్తునకు ఢిల్లీ ఎల్‌జీ ఆమోదం...

ABN , First Publish Date - 2022-09-11T20:13:31+05:30 IST

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం బస్సుల కొనుగోళ్ళలో

Kejriwal Government: డీటీసీ బస్సుల కొనుగోళ్లలో అక్రమాలు... సీబీఐ దర్యాప్తునకు ఢిల్లీ ఎల్‌జీ ఆమోదం...

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం బస్సుల కొనుగోళ్ళలో అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై సీబీఐ (Central Bureau of Investigation) చేత దర్యాప్తు చేయించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమోదం తెలిపారు. గతంలో వచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు జరిపించేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్ చేసిన విజ్ఞప్తిని లెఫ్టినెంట్ గవర్నర్‌ ఆమోదించారు. 


ఢిల్లీ రవాణా సంస్థ (DTC) కోసం 1,000 ‘లో ఫ్లోర్’ బస్సుల కొనుగోలుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కమిటీకి చైర్మన్‌గా ఢిల్లీ రవాణా శాఖ మంత్రిని చైర్మన్‌గా నియమించడంలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. బస్సుల కొనుగోలుకు టెండర్లు పిలవడం, కొనడం వంటి కార్యకలాపాలను ఈ కమిటీ నిర్వహించినట్లు తెలిపారు. అక్రమాలను ప్రోత్సహించడం కోసమే టెండర్ల ప్రక్రియకు మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా ఢిల్లీ ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ సిస్టమ్‌ (DIMTS)ను నియమించారని ఆరోపించారు. 


ఈ ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆగస్టులో సమర్పించిన నివేదికను లెఫ్టినెంట్ గవర్నర్ పరిశీలించారు. టెండర్ ప్రక్రియలో తీవ్రమైన లోపాలు జరిగాయని ఈ నివేదిక పేర్కొంది. సాధారణ ఆర్థిక నిబంధనలను, కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు తెలిపింది. టెండర్ల ప్రక్రియలో లోపాలను సమర్థించుకోవడానికే DIMTSను మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా నియమించారని తెలిపింది. డీటీసీ కమిషనర్ నివేదికలో కూడా ఇవే లోపాలను ఎత్తి చూపారు. 


లెఫ్టినెంట్ గవర్నర్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణ

లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాపై వచ్చిన ఆరోపణల నుంచి దృష్టి మరల్చేందుకే ఆయన ఇటువంటి దర్యాప్తులను చేయిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తోంది. ముగ్గురిపై (ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి) చేవలేని ఆరోపణలు చేసిన తర్వాత ఇక నాలుగో మంత్రిపై ఫిర్యాదు చేశారని మండిపడింది. మొదట తనపై వచ్చిన ఆరోపణలకు ఎల్‌జీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. 


ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ మీడియాతో మాట్లాడుతూ, ఈ బస్సులను కొనలేదన్నారు. ఆరోపణలు రావడంతో టెండర్లను రద్దు చేశామని చెప్పారు. ఢిల్లీకి మరింత గొప్ప విద్యావంతుడు లెఫ్టినెంట్ గవర్నర్‌గా రావాలన్నారు. ఈ అంశంపై సీబీఐ దర్యాప్తునకు పంపించడం ఇది మూడోసారి అని చెప్పారు. 


Updated Date - 2022-09-11T20:13:31+05:30 IST