Dimple : మెయిన్‌పురిలో డింపుల్ విజయం
ABN , First Publish Date - 2022-12-09T01:46:50+05:30 IST
ఇటీవల దేశవ్యాప్తంగా ఒక లోక్‌సభ స్థానానికి, ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేడీలు తమ సిటింగ్ స్థానాలను నిలబెట్టుకున్నాయి.
ఒక పార్లమెంట్.. ఆరు అసెంబ్లీ స్థానాల్లో మిశ్రమ ఫలితాలు
న్యూఢిల్లీ, డిసెంబరు 8: ఇటీవల దేశవ్యాప్తంగా ఒక లోక్‌సభ స్థానానికి, ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేడీలు తమ సిటింగ్ స్థానాలను నిలబెట్టుకున్నాయి. యూపీలోని మెయిన్‌పురి లోక్‌సభ స్థానాన్ని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నిలబెట్టుకోగా.. రాజస్థాన్, ఛత్తీ్‌సగఢ్‌లో ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ తన స్థానాలను పదిలపరుచుకుంది. ఒడిసాలో తన సిటింగ్ స్థానాన్ని బిజూ జనతాదళ్(బీజేడీ) నిలబెట్టుకుంది. యూపీలో ఎస్పీ సిటింగ్ అయిన రాంపూర్‌లో బీజేపీ, కమలదళం కంచుకోట అయిన కతౌలీలో రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్‌ఎల్డీ) జయకేతనం ఎగురవేశాయి. బిహార్‌లోని కుర్హానీలో జేడీయూ తన సిటింగ్ స్థానాన్ని కోల్పోయింది. అక్కడ బీజేపీ జయకేతం ఎగురవేసింది.
శివ్‌పాల్ పార్టీ కలవడంతో.. డింపుల్ ఘన విజయం
జూన్‌లో ఆజంగఢ్, రాంపూర్ లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ నుంచి ఆ సీట్లను కైవసం చేసుకుని, రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగిన కమలదళానికి మెయిన్‌పురి ఫలితాలు నిరాశ కలిగించాయి. మాజీ సీఎం అఖిలేశ్ బాబాయి శివ్‌పాల్ యాదవ్ వేరు కుంపటి-- ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ(లోహియా) పెట్టి, బీజేపీతో కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. ఉప ఎన్నికలకు ముందు ఆయన తన పార్టీని సమాజ్‌వాదీలో విలీనం చేశారు. దీంతో మొయిన్‌పురిలో అఖిలేశ్ భార్య డింపుల్ యాదవ్ విజయం సునాయాసమైంది. ఆమె తన ప్రత్యర్థి ప్రేమ్‌సింగ్ శాఖ్యా (బీజేపీ)పై 2,88,461 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. డింపుల్‌కు 6,18,120, శాఖ్యాకు 3,29,659 ఓట్లు వచ్చాయి. యూపీలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆర్‌ఎల్‌డీ, బీజేపీలు చెరో రెండు స్థానాలను గెలుచుకున్నాయి. ఖతౌలీలో ఆర్‌ఎల్‌డీ అభ్యర్థి మదన్ భయ్యా తన ప్రత్యర్థి రాజ్‌కుమారీ సైనీ(బీజేపీ)పై 22,075 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మదన్‌భయ్యాకు 97,071.. రాజ్‌కుమారీకి 74,996 ఓట్లు వచ్చాయి. రాంపూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఆకాశ్ సక్సేన తన ప్రత్యర్థి, సమాజ్‌వాదీ నేత ఆసిమ్ రజాపై 33,702 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ స్థానం సమాజ్‌వాదీకి.. ప్రత్యేకించి ఆ పార్టీ నేత ఆజంఖాన్‌కు కంచుకోట. ఆజంఖాన్‌పై అనర్హత వేటు పడడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. బిహార్‌లోని కుర్హానీ నియోజకవర్గంలో బీజేపీ పాగా వేసింది. జనతాదళ్(యూ) తమ సిటింగ్ స్థానమైన కుర్హానీ నుంచి మనోజ్‌సింగ్‌ను బరిలోకి దింపింది. బీజేపీ అభ్యర్థి కేదార్ ప్రసాద్ గుప్తా ఆయనపై 3,632 ఓట్లతో విజయం సాధించారు. కేదార్ ప్రసాద్‌కు 76,648.. మనోజ్‌సింగ్‌కు 73,008 ఓట్లు వచ్చాయి. ఛత్తీ్‌సగఢ్‌లోని భానుప్రతా్‌పపూర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో.. కాంగ్రెస్ అభ్యర్థి సావిత్రి మనోజ్ మండవి తన ప్రత్యర్థి బ్రహ్మానంద్ నేతం(బీజేపీ)పై 44,229 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాజస్థాన్‌లోని సర్దార్ షహర్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్‌శర్మ తన ప్రత్యర్థి అశోక్‌కుమార్ పించా(బీజేపీ)పై 26,850 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఒడిసాలోని పదమ్‌పూర్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు జరిగిన ఉప ఎన్నికలో బీజేడీ నేత బార్షాసింగ్ బారిహా తన ప్రత్యర్థి ప్రదీప్ పురోహిత్(బీజేపీ)పై 42,679 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బార్షాసింగ్ 1,20,807 ఓట్లు సాధించారు. ప్రదీ్‌పకు 78,128 ఓట్లు వచ్చాయి.