DMK: డీఎంకేలో చేరిన కోవై సెల్వరాజ్
ABN , First Publish Date - 2022-12-08T10:26:48+05:30 IST
కోయంబత్తూరు9Coimbatore)కు చెందిన అన్నాడీఎంకే మాజీ శాసనసభ్యుడు, కోవై సెల్వరాజ్ బుధవారం ఉదయం డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు.

చెన్నై, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): కోయంబత్తూరు9Coimbatore)కు చెందిన అన్నాడీఎంకే మాజీ శాసనసభ్యుడు, కోవై సెల్వరాజ్ బుధవారం ఉదయం డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి తర్వాత కోవై సెల్వరాజ్ మరో మాజీ ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వం (ఓపీఎస్) వర్గంలో చేరారు. ఓపీఎ్‌సకు కుడిభుజంగా ఉంటూ కోయంబత్తూరు పార్టీ నాయకుడిగా కొనసాగారు. ఇటీవల కోవై సెల్వరాజన్ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నాడీఎంకేను మాజీ ముఖ్యమంత్రులు ఈపీఎస్, ఓపీఎస్ పోటీపడి నాశనం చేస్తున్నారని, పార్టీ శ్రేణులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. దీంతో ఓపీఎస్ అతనిని పార్టీ పదవి నుంచి తొలగించారు. దానికి నిరసనగా సెల్వరాజ్ పార్టీ నుండి వైదొలగారు. ఈ నేపథ్యంలో సెల్వరాజ్ డీఎంకేలో చేరనున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వెలువడ్డాయి. చివరకు కోవై జిల్లాకు చెందిన మంత్రి సెంథిల్‌బాలాజీ సహకారంతో డీఎంకేలో చేరటానికి ముహూర్తం ఖరారైంది. ఆ మేరకు బుధవారం ఉదయం తేనాంపేటలోని డీఎంకే(DMK) ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను కలుసుకుని పార్టీ సభ్యత్వం స్వీకరించారు. కోవై సెల్వరాజ్‌కు పార్టీ సభ్యత్వ కార్డును అందజేసిన స్టాలిన్ అతనిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సెంథిల్‌బాలాజీ, కేఎన్ నెహ్రూ, పార్టీ ప్రముఖులు టీకేఎస్ ఇలంగోవన్, పూచ్చి మురుగన్, హార్బర్ ఖాజా తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత కోవై సెల్వరాజ్ అన్నా అరివాలయం వెలుపల విలేఖరులతో మాట్లాడుతూ కోయంబత్తూరు జిల్లాల్లో తన మద్దతుదారులతో సహా సుమారు ఐదు వేలమంది డీఎంకేలో చేరటానికి సిద్ధంగా ఉన్నారని, త్వరలో ఓ సభ ఏర్పాటు చేసి పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ సమక్షంలో వారికి పార్టీ సభ్యత్వం కల్పించనున్నామని ప్రకటించారు.