విద్యుత్‌ షాక్‌!: చార్జీలు పెంచిన ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-09-11T13:30:35+05:30 IST

డీఎంకే ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు విద్యుత్‌ షాక్‌(Electric shock) ఇచ్చింది. ఎనిమిదేళ్ల తర్వాత విద్యుత్‌ చార్జీలు పెంచుతూ నిర్ణయం

విద్యుత్‌ షాక్‌!: చార్జీలు పెంచిన ప్రభుత్వం

                              - తక్షణం అమలులోకి 


చెన్నై, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): డీఎంకే ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు విద్యుత్‌ షాక్‌(Electric shock) ఇచ్చింది. ఎనిమిదేళ్ల తర్వాత విద్యుత్‌ చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతేగాక ఈ ఆదేశాలు శనివారం నుంచే అమలులోకి వస్తున్నట్లు ప్రకటించింది. గత పదేళ్లుగా రాష్ట్ర విద్యుత్‌ బోర్డు(State Electricity Board) అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. ఆ సంస్థ రుణభారం రూ.12647 కోట్లకు పెరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీలను పెంచాలంటూ కేంద్ర విద్యుత్‌ నియంత్రణా మండలి ఆదేశించింది. దీంతో రాష్ట్ర విద్యుత్‌ బోర్డు చార్జీలను స్వల్పస్థాయిలో పెంచే దిశగా జాబితాను కూడా సిద్ధం చేసింది. ఆ మేరకు వినియోగదారులు ఉపయోగించే యూనిట్ల సంఖ్యను బట్టి రూ.27.50 నుంచి రూ.565 వరకు విద్యుత్‌ చార్జీల(Electricity charges)ను పెంచేందుకు పలు విడతలుగా ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టిన అనంతరం నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి అమలులోకి వచ్చిన విద్యుత్‌ చార్జీల ప్రకారం రెండు నెలల వరకు 200 యూనిట్ల విద్యుత్‌ వాడితే నెలకు రూ.27.50 చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఈ కేటగిరికీ చెందిన విద్యుత్‌ వినియోగదారులే అధికంగా ఉన్నారు. సుమారు 63.35 లక్షల మంది 200 యూనిట్ల వరకూ విద్యుత్‌ను ఉపయోగిస్తున్నారు. ఇదే విధంగా 300 యూనిట్ల విద్యుత్‌ను వాడితే రూ.72.50, 400 యూనిట్లు వాడితే రూ.147.50, 500 యూనిట్లు వాడితే రూ.297.50, 600 యూనిట్లు వాడితే రూ.155, 700 యూనిట్ల విద్యుత్‌ను వాడితే రూ.275లు, 800 యూనిట్ల విద్యుత్‌ను వాడితే రూ.395లు, 900 యూనిట్లు వరకు వాడితే రూ.565లను ప్రతినెలా చెల్లించాల్సి ఉంటుంది. ఈ పెంచిన విద్యుత్‌ చార్జీలు 2027 వరకూ అమలులో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.



Updated Date - 2022-09-11T13:30:35+05:30 IST