Fire Accident: మాల్దీవుల్లో అగ్ని ప్రమాదం... మృతుల్లో 9 మంది భారతీయులు...

ABN , First Publish Date - 2022-11-10T12:56:12+05:30 IST

మాల్దీవుల (Maldives) రాజధాని నగరం మాలే (Male)లో గురువారం సంభవించిన అగ్ని ప్రమాదంలో

Fire Accident: మాల్దీవుల్లో అగ్ని ప్రమాదం... మృతుల్లో 9 మంది భారతీయులు...
Maldieves Fire Accident

న్యూఢిల్లీ : మాల్దీవుల (Maldives) రాజధాని నగరం మాలే (Male)లో గురువారం సంభవించిన అగ్ని ప్రమాదంలో దాదాపు తొమ్మిది మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. విదేశీ కార్మికులు నివసిస్తున్న భవనంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు.

గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న వాహనాల మరమ్మతుల గేరేజ్ నుంచి మంటలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ భవనంలోని పై అంతస్థు నుంచి 11 మృతదేహాలను వెలికి తీశారు. వీరిలో తొమ్మిది మంది భారతీయులు. మృతులంతా వలస కార్మికులే. ఈ భవనంలో పరిమితికి మించి వ్యక్తులు నివసిస్తున్నారు.

మాల్దీవుల్లోని ఇండియన్ హై కమిషన్ స్పందిస్తూ, మాలేలో జరిగిన విషాదకర అగ్ని ప్రమాద సంఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ దారుణ సంఘటనపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మాల్దీవుల అధికారులను సంప్రదిస్తున్నట్లు తెలిపింది. సహాయం కావలసినవారు +9607361452, +9607790701 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చునని తెలిపింది.

మాల్దీవుల జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ స్పందిస్తూ, అగ్ని ప్రమాద బాధితులకు సహాయపడటం కోసం సమీపంలోని మాఫన్ను స్టేడియంలో సహాయక శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపింది.

మాలేలో సుమారు 2,50,000 మంది నివసిస్తున్నారు. వీరిలో దాదాపు సగం మంది విదేశీయులే. ముఖ్యంగా భారత దేశం, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక దేశాల నుంచి ఇక్కడికి వలస వస్తూ ఉంటారు.

Updated Date - 2022-11-10T12:56:18+05:30 IST