Covid-19 : భారతీయులకు హైబ్రిడ్ రోగ నిరోధక శక్తి ఉంది : ఎయిమ్స్ మాజీ డైరెక్టర్
ABN , First Publish Date - 2022-12-24T18:55:55+05:30 IST
కోవిడ్-19 మహమ్మారి (Covid-19 pandemic) మరోసారి వచ్చినప్పటికీ మన దేశం పరిస్థితి చైనా కన్నా సురక్షితంగా ఉందని అఖిల భారత
న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి (Covid-19 pandemic) మరోసారి వచ్చినప్పటికీ మన దేశం పరిస్థితి చైనా కన్నా సురక్షితంగా ఉందని అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ (AIIMS) మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా (Randeep Guleria) చెప్పారు. ఆందోళన అవసరం లేని స్థితిలో మన దేశం ఉందన్నారు. అంతర్జాతీయ విమాన ప్రయాణాలను కట్టడి చేయవలసిన అవసరం లేదన్నారు. ఇన్ఫెక్షన్ వ్యాప్తిని ఆపడానికి విమానాలను నిషేధించడం అంత సమర్థవంతమైన చర్య కాదని గత అనుభవాలు చెప్తున్నాయన్నారు. చైనాలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోందనే ఆందోళన నడుమ ఆయన ఓ వార్తా సంస్థకు శనివారం ఇంటర్వ్యూ ఇచ్చారు.
చైనాలో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోందని వార్తలు వస్తుండటంతో భారత ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీ-పీసీఆర్ (RT-PCR) పరీక్షలను తప్పనిసరి చేసింది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, టీకాలు వేయించుకోవాలని ప్రజలను కోరింది.
ఈ నేపథ్యంలో డాక్టర్ గులేరియా మాట్లాడుతూ, భారత దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ చాలా బాగా జరిగిందని చెప్పారు. వ్యాక్సినేషన్ కవరేజ్, నేచురల్ ఇన్ఫెక్షన్ వల్ల ప్రజలకు ఇప్పటికే హైబ్రిడ్ ఇమ్యూనిటీ వచ్చిందన్నారు. అందువల్ల కోవిడ్ మహమ్మారి మరోసారి విజృంభించినప్పటికీ తీవ్ర స్థాయిలో కోవిడ్ కేసులు పెరగడం కానీ, ఆసుపత్రుల్లో చేరవలసిన అవసరం రావడం కానీ జరిగే అవకాశం లేదన్నారు.
సహజంగా ఇన్ఫెక్షన్ సోకడం, టీకాలు వేయించుకోవడం వల్ల హైబ్రిడ్ ఇమ్యూనిటీ (రోగ నిరోధక శక్తి) వస్తుంది.
ఒమిక్రాన్ (Omicron) సబ్ వేరియంట్ బీఎఫ్.7 (BF.7) ఇప్పటికే భారత దేశంలో ఉందని, అందువల్ల ఆసుపత్రుల్లో చేరవలసినంత స్థాయిలో తాజాగా మహమ్మారి వచ్చే అవకాశం లేదని డాక్టర్ గులేరియా చెప్పారు.
ఎపిడమియాలజిస్ట్ డాక్టర్ చంద్రకాంత్ లహరియా ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణాలపై నిషేధం విధించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని చెప్పారు. గత ఏడాది ఒమిక్రాన్ వేరియంట్ విషయంలో దీనిని మనం చూశామన్నారు. ప్రయాణాలపై నిషేధం విధించినప్పటికీ, దాని పాత్ర ఈ మహమ్మారి వ్యాప్తిలో ఏమీ లేదన్నారు. మరోవైపు భారత దేశంలో ఇప్పటికే 250కిపైగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు ఉన్నాయన్నారు. కాబట్టి మన దేశానికి వచ్చే ప్రయాణికులకు రాండమ్ శాంప్లింగ్ పరీక్షలు చేయడమే అత్యంత హేతుబద్ధమైన చర్య అవుతుందన్నారు. కొత్త కోవిడ్ సబ్ వేరియంట్ల జాడను కనిపెట్టడమే దీని వల్ల కలిగే ప్రయోజనమని తెలిపారు.
మరికొందరు నిపుణులు చెప్తున్నదాని ప్రకారం, చైనాలో ఇటీవలే కఠినమైన ఆంక్షలను తొలగించారు. చైనా టీకాలను తీసుకున్నవారిలో సహజమైన రోగనిరోధక శక్తి లేదు. అందువల్ల భారత్, చైనాలను ఈ విషయంలో పోల్చి చూడటం సరికాదు.
ఇదిలావుండగా, చైనాలో కోవిడ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ (Mansukh Mandaviya) ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించారు. కోవిడ్-19 మహమ్మారి మేనేజ్‌మెంట్ కోసం మెడికల్ ఆక్సిజన్ (Medical Oxygen) క్రమబద్ధంగా, నిరంతరాయంగా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం లేఖ రాసింది.
మన్‌సుఖ్ మాండవీయ శనివారం ఓ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంగ్ కాంగ్, థాయ్‌లాండ్ దేశాల నుంచి మన దేశానికి వచ్చేవారికి తప్పనిసరిగా ఆర్‌టీ-పీసీఆర్ టెస్ట్ చేయాలి. ఈ పరీక్షలో కోవిడ్ లక్షణాలు కనిపించినవారిని వెంటనే క్వారంటైన్‌కు పంపిస్తారు. మన దేశానికి వచ్చే విదేశీ ప్రయాణికులు తప్పనిసరిగా కోవిడ్ నెగెటివ్ టెస్ట్ రిపోర్టును కలిగియుండాలని ఆదేశించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందని జరుగుతున్న ప్రచారం బూటకమని, ప్రజలను తప్పుదోవ పట్టించే వదంతి అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం స్పష్టం చేసింది.