Dance in burqa: నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు చేసిన పనిది.. బుర్కా ధరించి..

ABN , First Publish Date - 2022-12-09T16:30:16+05:30 IST

కాలేజీ ఈవెంట్‌లో విద్యార్థులు బుర్కాలు ధరించి డ్యాన్స్ (Dance in burqa) చేయడం వివాదాస్పదంగా మారింది. బుర్కా ధరించి అసభ్యకరంగా, బుర్కాను అవహేళనపరిచేలా డ్యాన్స్ చేశారంటూ ముస్లిం వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

Dance in burqa: నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు చేసిన పనిది.. బుర్కా ధరించి..

మంగళూరు: కాలేజీ ఈవెంట్‌లో విద్యార్థులు బుర్కాలు ధరించి డ్యాన్స్ (Dance in burqa) చేయడం వివాదాస్పదంగా మారింది. బుర్కా ధరించి అసభ్యకరంగా, బుర్కాను అవహేళనపరిచేలా డ్యాన్స్ చేశారంటూ ముస్లిం వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో సదరు విద్యార్థులను కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. కర్ణాటకలోని (karnataka) మంగళూరులో వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

మంగళూరులోని సెయింట్ జోసెఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో మంగళవారం ఒక కాలేజీ ఈవెంట్ జరిగింది. స్టూడెంట్స్ అసోయేసిన్ ప్రారంభం సందర్భంగా నిర్వహించిన ప్రోగ్రామ్‌లో నలుగురు విద్యార్థులు బుర్కా ధరించి ఓ బాలీవుడ్ పాటకు డ్యాన్స్ వేశారు. అయితే అదే వేదిక వద్ద కొంతమంది ముస్లిం వర్గం విద్యార్థులు అభ్యంతరం తెలిపారు. నిరసన తెలిపేందుకు స్టేజీ మీదకు దూసుకెళ్లే ప్రయత్నం కూడా చేశారు. అయితే అప్పటికే తమ సెల్‌ఫోన్లతో చిత్రించిన ఒక వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒక క్లిప్ వైరల్‌గా మారడంతో ముస్లిం వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. బుర్కాలో ఉండి అసభ్యకరంగా, అవహేళన చేసేలా డ్యాన్స్ చేశారంటూ తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఈ విషయం కాస్తా కాలేజీ యాజమాన్యం దృష్టికి వెళ్లడంతో నలుగురు విద్యార్థులపై సస్పెన్షన్ వేటు పడింది.

ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం స్పందించింది. విద్యార్థులు నిర్వహించిన ప్రోగ్రామ్‌కు అనుమతిలేదని వెల్లడించింది. ఈ ఘటనలో భాగస్వామ్యమున్న విద్యార్థులను సస్పెండ్ చేశామని, దర్యాప్తు జరగనున్నట్టు పేర్కొంటూ కాలేజీ ప్రిన్సిపల్ డా. ఎం సుధీర్ ఒక ప్రకటన విడుదల చేశారు. కాలేజీ ప్రాంగణంలో వర్గాల మధ్య సామరస్యానికి హానికరమైన ఇలాంటి కార్యక్రమాలను కాలేజీ ప్రోత్సాహించదని స్పష్టం చేశారు. ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడినవారిని ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. ఇలాంటి విషయాలకు సంబంధించి కాలేజీ క్యాంపస్‌లో కఠిన నిబంధనలు అమల్లో ఉంటాయని గుర్తుచేశారు.

Updated Date - 2022-12-09T16:36:10+05:30 IST