గవర్నర్‌ ఇప్పుడేం చేస్తారో?

ABN , First Publish Date - 2022-02-10T15:47:58+05:30 IST

శాసనసభ ప్రత్యేక సమా వేశంలో మరిన్ని సవరణలు, చేర్పులు, మార్పులతో ప్రతి పాదించిన ‘నీట్‌ మినహా యింపు బిల్లు’పె గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటా రోనన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. డీఎంకే

గవర్నర్‌ ఇప్పుడేం చేస్తారో?

                              - ‘నీట్‌ మినహాయింపు బిల్లు’పై సర్వత్రా ఉత్కంఠ


చెన్నై: శాసనసభ ప్రత్యేక సమా వేశంలో మరిన్ని సవరణలు, చేర్పులు, మార్పులతో ప్రతి పాదించిన ‘నీట్‌ మినహా యింపు బిల్లు’పె గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటా రోనన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. డీఎంకే ప్రభుత్వం తొలిసారిగా రూపొందించిన నీట్‌ మినహాయింపు బిల్లును గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తిరస్కరించి రాష్ట్రంలో రాజకీయ వేడిని రగిల్చారు. రెండోమారు డీఎంకే ప్రభుత్వం మంగళవారం సాయంత్రం పంపిన నీట్‌ మినహాయింపు బిల్లును గవర్నర్‌ మళ్లీ తిప్పిపంపటానికి అవకాశం లేదు. ఈ పరిస్థితిలో గవర్నర్‌ రెండు రకాల నిర్ణయాలను మాత్రమే తీసుకోగలుగుతారు. ఆ బిల్లును వీలైనంత త్వరగా రాష్ట్రపతి ఆమోదానికి పంపటం, లేదా న్యాయ నిపుణులతో సంప్ర దింపుల పేరుతో పెండింగ్‌లో ఉంచడం మాత్రమే గవర్నర్‌ ముందున్న మార్గాలు. అయితే బిల్లును సుదీర్ఘ కాలం పెండింగ్‌లో ఉంచితే డీఎంకే సహా అన్ని పార్టీ లు ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశాలున్నాయి. సాధారణంగా శాసనసభలో చేసిన ముసాయిదా చట్టానికి గవర్నర్‌ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అవసరమైతే న్యాయనిపుణులతో చర్చించవచ్చు. రాజ్యాంగ ధర్మా సనం 200 సెక్షన్‌ ప్రకారం అవసరమైతే గవర్నర్‌ ముసాయిదా చట్టాన్ని రాష్ట్రపతి పరిశీలనకు పంపాలి. ఇదే విధంగా రాజ్యాంగ ధర్మాసనం 201 సెక్షన్‌ ప్రకారం రాష్ట్రపతి ఆ ముసాయిదా చట్టానికి ఆమోదం ప్రకటించ వచ్చు, తిరస్కరించవచ్చు. లేదా కొంతకాలం పాటు పరిశీలన (పెండింగ్‌)లో ఉంచవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపే బిల్లును గవర్నర్‌ ఎన్ని రోజుల్లోగా రాష్ట్రపతికి పంపాలనే విషయంపై రాజ్యాంగంలో ఎక్కడా ఎలాంటి ప్రస్తావన లేదు. ఇదే విధంగా రాష్ట్రపతి కూడా రాష్ట్రాల నుంచి వచ్చే బిల్లులను ఎంతకాలంపాటు పెండింగ్‌లో ఉంచవచ్చన్న దానిపై కూడా రాజ్యాంగ ధర్మాసనంలో ఇతమిత్థమైన సమాచారం లేదు.


మళ్ళీ జాప్యమేనా?

డీఎంకే గత సెప్టెంబర్‌లో ప్రతిపాదించిన నీట్‌ మినహాయింపు బిల్లును గవర్నర్‌ ఐదు నెలలపాటు పెండింగ్‌లో ఉంచి ఈ నెల ఒకటిన స్పీకర్‌కు తిప్పిపంపారు. గవర్నర్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై న్యాయస్థానాలు జోక్యం చేసుకోకుండా రాజ్యాంగ ధర్మాసనం 361 సెక్షన్‌ ప్రకారం ఆయన విశేషమైన అధికారాలు కలిగి ఉన్నారు. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే నీట్‌ మినహాయింపు బిల్లును గవర్నర్‌ వీలైనంత త్వరగా రాష్ట్రపతి ఆమోదానికి పంపినా ఆ బిల్లుకు ఆమోదం లభించడానికి లేదా ఆ బిల్లును తోసిపుచ్చటానికి నెలలు, లేదా సంవత్సరాలు పట్టవచ్చని తెలుస్తోంది. అలాంటి పరిస్థితులు ఎదురైతే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. అయితే బిల్లును ఆమోదిం చాలని సుప్రీంకోర్టు రాష్ట్రపతిపై ఒత్తిడి చేయడానికి ఆస్కారమే లేదు. వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని మాత్రమే సూచించగలుగుతుంది. 


త్వరలోనే నిర్ణయం?

నీట్‌ మినహాయింపు బిల్లుపై ఈసారి గవర్నర్‌, రాష్ట్రపతి వీలయినంత త్వరగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సీనియర్‌ న్యాయవాది, డీఎంకే రాజ్యసభ సభ్యుడు విల్సన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో మణిపూర్‌ శాసనసభ వ్యవహారంలో సర్కారియా కమిషన్‌ వ్యవహారంలోను ఇలాంటి బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు సుప్రీంకోర్టు కాల నిర్ణయాన్ని సూచించిందని తెలిపారు. అదేరీతిలో నీట్‌ మినహాయింపు బిల్లుపై కూడా నిర్ణీత కాలంలోపే నిర్ణయాలు వెలువడుతాయన్నారు. అయితే ప్రభుత్వ మాజీ అడ్వకేట్‌ జనరల్‌ విజయనారాయణ్‌ ఈ వాదనను పూర్తిగా తోసిపుచ్చారు. నీట్‌ మినహాయింపు బిల్లుపై చట్ట ప్రకారం విజయం సాధించే అవకాశాలే లేవని ఆయన వ్యాఖ్యానించారు. 


తాత్కాలిక మినహాయింపు....

మాజీ అడ్వకేట్‌ జనరల్‌ సోమయాజి కూడా రాజకీయ పరంగా, చట్ట పరంగా నీట్‌ మినహాయింపు బిల్లు వ్యవహారం లో రాష్ట్ర ప్రభుత్వానికి వెనువెంటనే విజయం లభించక పోవచ్చని వ్యాఖ్యానించారు. అయితే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రతిపాదన పెట్టుకునే అవకాశముంద న్నారు. వీలైతే రెండు మూడేళ్లపాటు నీట్‌ మినహాయించాలంటూ అడిగితే అనుమతి లభించే అవకాశముందని చెప్పారు. అది తాత్కాలిక మినహా యింపే అవుతుంది కాని శాశ్వతంగా ఉండదని తెలిపారు. ఇలా న్యాయ నిపుణులు వేర్వేరు రకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ తాజా నీట్‌ మినహా యింపు బిల్లును రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి వీలైనంత త్వరగా రాష్ట్రపతి ఆమోదానికి పంపటం మినహా మరో గత్యంతరమే లేదని స్పష్టమవుతోంది. ఒకసారి బిల్లును నాలుగు నెలల పాటు పెండింగ్‌లో ఉంచి తిరస్కరించిన తర్వాత రెండో మారు అన్ని నెలలపాటు బిల్లును పరిశీలనలో ఉంచరని, వీలైనంత త్వరగా రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తారనని రాజ్‌ భవన్‌ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే గవర్నర్‌ న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. గవర్నర్‌ పంపిన నీట్‌ మినహాయింపు బిల్లుపై రాష్ట్రపతి నిర్ణయం ప్రకటించిన తర్వాతనే డీఎంకే ప్రభుత్వం తదుపరి చర్యలను తీసుకోగలుగుతుంది.

Updated Date - 2022-02-10T15:47:58+05:30 IST