Tamilnadu Governor RN Ravi: గవర్నర్‌గారూ... పదవి నుంచి తప్పుకోండి!

ABN , First Publish Date - 2022-10-31T11:40:33+05:30 IST

రాజ్యాంగ ధర్మాసనానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వంపై బహిరంగ సభల్లో విమర్శలు చేస్తున్న గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి పదవి నుంచి

Tamilnadu Governor RN Ravi: గవర్నర్‌గారూ... పదవి నుంచి తప్పుకోండి!

డీఎంకే మిత్రపక్షాల డిమాండ్‌

చెన్నై: రాజ్యాంగ ధర్మాసనానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వంపై బహిరంగ సభల్లో విమర్శలు చేస్తున్న గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి పదవి నుంచి తప్పుకోవాలని డీఎంకే మిత్రపక్షాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఆ మేరకు ఆదివారం ఓ సంయుక్త ప్రకటన మీడియాకు విడుదల చేశారు. కేంద్రంలో బీజేపీ పాలకుల మెప్పు పొంది గవర్నర్‌ హోదా కంటే మరింత ఉన్నతమైన పదవిని ఆశిస్తూ గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి బాధ్యతలు విస్మరించి ప్రవర్తిస్తున్నారని విరుచుకుపడ్డారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి, ద్రవిడకళగం నేత కే వీరమణి, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో, సీపీఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి బాలక్ణృన్‌, సీపీఐ రాష్ట్ర కమిటీ కార్యదర్శి ముత్తరసన్‌,, ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌ నేత కాదర్‌మొయిద్దీన్‌, డీపీఐ నేత తిరుమావళవన్‌, మనిదనేయ మక్కల్‌ కట్చి నేత జవాహిరుల్లా, తమిళగ వాళ్వురిమై కట్చి నాయకుడు వేల్‌మురుగన్‌, కొంగునాట్టు మక్కల్‌ దేశీయ కట్చి ప్రధాన కార్యదర్శి ఈశ్వరన్‌, డీఎంకే ఎంపీ టీఆర్‌ బాలు ఈ ప్రకటనపై సంతకాలు చేశారు.

డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు చేయడమే ముఖ్యమని భావిస్తే ఆర్‌ఎన్‌ రవి గవర్నర్‌ పదవి నుంచి తప్పుకుని విమర్శించవచ్చని సలహా ఇచ్చారు. గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వ ప్రతిష్టను కించపరిచేలా ప్రవర్శించటం, విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని డీఎంకే మిత్రపక్షాల నాయకులు ఆరోపించారు. ఇటీవల ఆయన సనాతన, ఆర్య, ద్రావిడ, షెడ్యూలు వర్గాలవారి గురించి, తిరుక్కురళ్‌ కోసం వెల్లడించిన అభిప్రాయాలన్నీ ప్రజలమధ్య చిచ్చురగిల్చేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.. గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఆధ్యాత్మిక భావాలు కలిగినవారైనా ద్రావిడ తరహా డీఎంకే పాలనను విమర్శించడం గర్హనీయమన్నారు.

ఇటీవల భారత దేశం సెక్యూలర్‌ దేశమని చెబుతున్నారని, అయితే ఏ దేశమైనా సరే మతం ప్రాతిపదికగానే మనుగడసాగిస్తుందని, ఈ విషయంలో భారతదేశం మినహాయింపు కాదని, మతప్రాతిపదిక పరమైన దేశమేననే భావంతో మాట్లాడటం రాజ్యాంగానికి విరుద్ధమని తెలిపారు. ఆ మాటలను బట్టి గవర్నర్‌కు ప్రపంచ చరిత్ర, రాజ్యాంగ ధర్మాసనం గురించి ఏవీ తెలియడం లేదని రుజువవుతోందన్నారు. ఐక్యరాజ్య సమితి గుర్తింపు కలిగిన 195 దేశాల్లో 30 దేశాలు మాత్రమే మతప్రాతిపదికపరమైనవని ఆ నాయకులు గుర్తు చేశారు. ఏది ఏమైనప్పటికీ కేంద్రంలోని బీజేపీ పాలకులకు మద్దతుగా ప్రవర్తిస్తూ డీఎంకే ప్రభుత్వ పాలన కించపరిచేలా వ్యాఖ్యలు చేయడమే గవర్నర్‌ పనిగా పెట్టుకున్నట్లు ఇటీవల ప్రకటనలు రుజువు చేస్తున్నాయని నాయకులు ఆరోపించారు. రాజ్యాంగ ధర్మాసనానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్న గవర్నర్‌ పదవి నుంచి తప్పుకోవడమే మంచిదని డీఎంకే మిత్ర పక్షాల నాయకులు హితవు పలికారు.

Updated Date - 2022-10-31T11:54:25+05:30 IST