Neelagiri జిల్లాను ముంచెత్తిన వర్షం

ABN , First Publish Date - 2022-07-15T13:09:52+05:30 IST

నీలగిరి జిల్లా ఊటీ, గూడలూరు తదితర ప్రాంతాల్లో ఈశాన్యరుతుపవనాలు తీవ్రరూపం దాల్చటంతో రెండు రోజులుగా కుండపోతగా కురిసిన వర్షాలకు

Neelagiri జిల్లాను ముంచెత్తిన వర్షం

                              - స్తంభించిన జనజీవనం


చెన్నై, జూలై 14 (ఆంధ్రజ్యోతి): నీలగిరి జిల్లా ఊటీ, గూడలూరు తదితర ప్రాంతాల్లో ఈశాన్యరుతుపవనాలు తీవ్రరూపం దాల్చటంతో రెండు రోజులుగా కుండపోతగా కురిసిన వర్షాలకు జనజీవనం స్తంభించింది. మసినకుడి, తెప్పకాడు రహదారి మధ్యనున్న వంతెన వరద ప్రవాహంలో కొట్టుకుపోవడంతో రెండు ప్రాంతాల నడమ రాకపోకలు స్తంభించాయి. దీని కారణంగా వరదనీటిలో కొట్టుకుపోతున్న స్థానికులను అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కాపాడారు. గత పదిహేను రోజులుగా ఊటీ, గూడలూరు తదితర ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండురోజులపాటు ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో ఈ రెండు ప్రాంతాల్లోని ఘాట్‌రోడ్లలో మట్టిపెళ్ళలు విరిగిపడ్డాయి. పలుచోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పొన్నివాగు, మాయారు తదితర వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. గూడలూరు నుంచి మైసూరు, బెంగళూరు, ఊటీ పందలూరు, ఎమర్లాడ్‌ వెళ్లే రహదారుల్లో చెట్లు కూలిపడ్డాయి. మట్టిపెళ్ళలు, బండరాళ్లు విరిగిపడ్డాయి. దీంతో గంటలపాటు ఈ మార్గాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గూడలూరు - ఊటీ రహదారిలోని నడువట్టమ్‌ ప్రాంతం వద్ద మట్టిపెళ్ళలు విరిగి పడ్డాయి. అగ్నిమాపక, ప్రజాపనుల శాఖల అధికారులు, మున్సిపల్‌ అధికారులు కలిసి ఈ మార్గంలో కూలిన చెట్లను, మట్టిపెళ్లలను యుద్ధ ప్రాతిపదికన తొలగించారు. భారీ వర్షాల కారణంగా ఊటీ ప్రభుత్వ ఆస్పత్రి ప్రహారీ కూలిపడటంతో అక్కడ నిలిపి ఉన్న రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.  ఓ కారులో కూర్చుని ఉన్న విశ్వనాథన్‌ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. భారీ వర్షాలు కురుస్తుండటంతో ఊటీ, కుందా, గూడలూరు ప్రాంతాల్లోని పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఇదిలా ఉండగా రుతుపవనాల ప్రభావితంతో ఊటీ, గూడలూరు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ పరిశోధన అధికారులు తెలిపారు. బుధవారం గూడలూరు బజార్‌ ప్రాంతంలో అత్యధికంగా 23 సెం.మీల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. మేల్‌గూడలూరు వద్ద22 సెం.మీలు, అవలాంచి వద్ద 19 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు.



Updated Date - 2022-07-15T13:09:52+05:30 IST