Himchal Pradesh: గృహ హింస కేసులో మాజీ సీఎం భార్య, కుమారుడికి సమన్లు
ABN , First Publish Date - 2022-12-16T15:24:53+05:30 IST
హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి దివంగత వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్, ఆమె కుమారుడు, సిమ్లా ఎమ్మెల్యే విక్రమాదిత్య సింగ్...
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి దివంగత వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ (Pratibha Singh), ఆమె కుమారుడు, సిమ్లా ఎమ్మెల్యే విక్రమాదిత్య సింగ్ (Vikramaditya Singh) చిక్కుల్లో పడ్డారు. విక్రమాదిత్య సింగ్ మాజీ భార్య సుదర్శన్ సింగ్ ఛుండావత్ (Sundarshan singh Chundawat) వేసిన గృహ హింస (Domestic violence) కేసులో ప్రతిభ, విక్రమాదిత్యకు కోర్టు సమన్లు పంపింది. భర్త, అత్త, వదిన, బావ కలిసి తనను వేధింపులు గురిచేసేవారని, గృహ హింసకు పాల్పడ్డారని సుదర్శన్ సింగ్ ఛుండావత్ తన ఫిర్యాదులో ఆరోపించారు.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన అనంతరం సీఎం పదవికి ప్రతిభా సింగ్ పోటీపడ్డారు. రాష్ట్రంలో అతి పెద్ద నేతగా పేరున్న వీరభద్ర సింగ్ గత ఏడాది కన్నుమూశారు. కాగా, రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన ఛుండావత్ గృహహింస కేసుతో పాటు మరో కేసులో ఛండీగఢ్‌కు చెందిన అమ్రీన్ అనే మహిళతో తన భర్త సంబంధాలు సాగించేవాడని ఆరోపించారు. తన కదలికలపై నిఘా కోసం తానుండే గదిలో సీసీటీవీ కెమెరాలను విక్రమాదిత్య ఏర్పాటు చేశాడని ఆమె పేర్కొన్నారు. గృహ హింస కేసులో జవరిలో తమ ముందు హాజరుకావాలని ఉదంపూర్ కోర్టు ప్రతిభ, విక్రమాదిత్యను ఆదేశించగా, రెండో కేసులో తనకు నష్టపరిహారం ఇవ్వాలని ఛుండావత్ కోరారు.
విక్రమాదిత్య, ఛుండావత్‌లు 2019 మార్చిలో వివాహం చేసుకున్నారు. వీరభద్ర సింగ్ మరణాంతరం తనను పుట్టింటికి పొమ్మని భర్త బలవంతం చేశాడని, తన నుంచి రూ.10 కోట్లు డిమాండ్ చేశాడని ఛుండావత్ ఆరోపించారు. కాగా, గృహ హింస కేసులో నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయంటూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు వైరల్ అయ్యారు. దీనిపై విక్రమాదిత్య స్పందిస్తూ, తనకు కానీ, తన కుటుంబసభ్యులకు కానీ ఎలాంటి నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ కాలేదని వివరణ ఇచ్చారు. తామెలాంటి తప్పూ చేయలేదని, తమకు నాన్‌బెయిల్ వారెంట్లు జారీ అయ్యే ప్రశ్నే లేదని ఒక వీడియోలో ఆయన చెప్పారు. కుటుంబానికి చెందిన వ్యక్తిగత అంశాలపై తాను వ్యాఖ్యానించేది లేదన్నారు. కోర్టులో మధ్యవర్తిత్వం ద్వారానే ఆమోదయోగ్యమైన రీతిలో ఈ అంశం పరిష్కారమవుతునందని చెప్పారు.