Himachal Polls : ముగిసిన హిమాచల్ ఎన్నికలు... ఓటర్లను సత్కరించిన ఎన్నికల అధికారులు...

ABN , First Publish Date - 2022-11-12T19:12:02+05:30 IST

హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల పోలింగ్ శనివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది.

Himachal Polls : ముగిసిన హిమాచల్ ఎన్నికలు... ఓటర్లను సత్కరించిన ఎన్నికల అధికారులు...
Kunjuk Chodan, Election Officials falicitating Voters

న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల పోలింగ్ శనివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 68 మంది ఎమ్మెల్యేలను ఎన్నుకోవడం కోసం జరిగిన ఈ ఎన్నికల్లో, పోలింగ్ ముగిసే సమయానికి సుమారు 66 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓ పోలింగ్ స్టేషన్‌లో ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లను అధికారులు శాలువలు, తినుబండారాలతో సత్కరించారు.

ఎన్నికల కమిషన్ తెలిపిన వివరాల ప్రకారం, శాసన సభ ఎన్నికల పోలింగ్ శనివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం మీద సుమారు 66 శాతం పోలింగ్ నమోదైంది. అధికారులు ఈవీఎంలు, వీవీప్యాట్‌లను వివిధ కేంద్రాల్లో భద్రపరుస్తున్నారు. ఓట్ల లెక్కింపు డిసెంబరు 8న జరుగుతుంది.

ప్రపంచంలో అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఉన్న పోలింగ్ బూత్‌గా రికార్డు సృష్టించిన టషింగంగ్ బూత్‌లో నూటికి నూరు శాతం ఓటింగ్ నమోదైంది. ఇక్కడ రిజిస్టర్ అయిన మొత్తం ఓటర్ల సంఖ్య 52 కాగా, అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ బూత్ సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ ఓటు వేయడానికి వయోవృద్ధులకు, దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు ప్రోత్సహించారు. సంప్రదాయ దుస్తులు ధరించిన ఎన్నికల అధికారులు పోలింగ్ బూత్‌కు వచ్చే ఓటర్లను శాలువలతో సత్కరించి, ప్రత్యేకంగా తయారు చేసిన స్వీట్లను బహూకరించారు. తొలిసారి ఓటు హక్కును పొందిన యువతి కుంజుక్ చోడన్ కూడా ఈ బూత్‌లో ఓటు వేశారు.

Updated Date - 2022-11-12T19:12:16+05:30 IST