Google CEO Sundar Pichai : భారత్‌ నాలో ఒక భాగం

ABN , First Publish Date - 2022-12-04T00:52:43+05:30 IST

‘భారతదేశం నాలో ఒక భాగం. నేను ఎక్కడికి వెళ్లినా అది నాతోనే ఉంటుంది’ అని గూగుల్‌, ఆల్ఫాబెట్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ అన్నారు. ఇటీవల భారత ప్రభుత్వం ప్రకటించిన దేశ మూడో అత్యున్నత పౌరపురస్కారం పద్మభూషణ్‌ అవార్డును ఆయన శుక్రవారం అందుకున్నారు.

Google CEO Sundar Pichai : భారత్‌ నాలో ఒక భాగం

గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌.. అమెరికాలో పద్మభూషణ్‌ అవార్డు ప్రదానం

వాషింగ్టన్‌, డిసెంబరు 3: ‘భారతదేశం నాలో ఒక భాగం. నేను ఎక్కడికి వెళ్లినా అది నాతోనే ఉంటుంది’ అని గూగుల్‌, ఆల్ఫాబెట్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ అన్నారు. ఇటీవల భారత ప్రభుత్వం ప్రకటించిన దేశ మూడో అత్యున్నత పౌరపురస్కారం పద్మభూషణ్‌ అవార్డును ఆయన శుక్రవారం అందుకున్నారు. అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్‌ సింగ్‌ సంధు శాన్‌ఫ్రాన్సిస్కోలో ఈ గౌరవాన్ని అందజేశారు. తమిళనాడులోని మదురైలో జన్మించిన సుందర్‌ పిచాయ్‌కు 2022 ఏడాదికి గానూ భారత ప్రభుత్వం ట్రేడ్‌ అండ్‌ ఇండస్ట్రీ విభాగంలో పద్మభూషణ్‌ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. పద్మభూషణ్‌ అవార్డుతో నన్ను గౌరవించిన భారత ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నన్ను తీర్చిదిద్దిన దేశం నన్నిలా గౌరవించడం గొప్ప అనుభూతినిస్తోందని అన్నారు. సాంకేతికత ప్రయోజనాలను మరింత మందికి అందించేందుకు గూగుల్‌, భారత్‌ మధ్య గొప్ప భాగస్వామ్యాన్ని కొనసాగించాలని భావిస్తున్నానని పిచాయ్‌ చెప్పారు. ప్రధాని మోదీ డిజిటల్‌ ఇండియా విజన్‌ పురోగతికి ఉత్ర్పేరకంలా ఉందన్నారు. అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్‌ సింగ్‌ సంధు మాట్లాడుతూ.. ‘సుందర్‌ పిచాయ్‌కు పద్మభూషణ్‌ అందజేయడం చాలా ఆనందంగా ఉంది. మదురై నుంచి మౌంటెయిన్‌ వ్యూ వరకు సుందర్‌ చేసిన స్ఫూర్తిదాయక ప్రయాణం అమెరికా-భారత్‌ ఆర్థిక, సాంకేతిక సంబంధాలను బలోపేతం చేయడం, ప్రపంచ ఆవిష్కరణల్లో భారతీయ ప్రతిభావంతుల సహకారాన్ని పునరుద్ఘాటిస్తోంది’ అని అన్నారు.

Updated Date - 2022-12-04T00:52:48+05:30 IST