Jammu and Kashmir : కశ్మీరు లోయలో రెండు గొప్ప మార్పులు : పోలీసులు

ABN , First Publish Date - 2022-12-31T16:14:47+05:30 IST

జమ్మూ-కశ్మీరు (Jammu and Kashmir)లో 2022లో రెండు చెప్పుకోదగ్గ మార్పులు కనిపించినట్లు పోలీసులు తెలిపారు.

Jammu and Kashmir : కశ్మీరు లోయలో రెండు గొప్ప మార్పులు : పోలీసులు
Jammu and Kashmir

శ్రీనగర్ : జమ్మూ-కశ్మీరు (Jammu and Kashmir)లో 2022లో రెండు చెప్పుకోదగ్గ మార్పులు కనిపించినట్లు పోలీసులు తెలిపారు. కశ్మీరులో 93 కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ జరిగాయని, 172 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని తెలిపారు. వీరిలో అత్యధికులు లష్కరే తొయిబా, దాని అనుబంధ ఉగ్రవాద సంస్థకు చెందినవారని చెప్పారు. మరోవైపు ఉగ్రవాదుల చేతుల్లో 29 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

2022వ సంవత్సరం ముగుస్తున్న సమయంలో కశ్మీరు జోన్ అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, కశ్మీరు లోయలోని సమాజంలో ముఖ్యంగా రెండు మార్పులు కనిపించాయన్నారు. ఆ మార్పులను వివరిస్తూ, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడానికి ఇళ్ల యజమానులు నిరాకరించడం ప్రారంభించారని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఉగ్రవాద సంస్థల్లో చేరడాన్ని గర్వకారణంగా భావించడం మానేశారని చెప్పారు. ఇప్పటికే ఉగ్రవాదంలో చేరినవారిని తిరిగి రావాలని కోరుతున్నారన్నారు. ఉగ్రవాదులను బహిరంగంగానే దూషిస్తున్నారని చెప్పారు. తమ పిల్లలను తిరిగి రప్పించేందుకు జమ్మూ-కశ్మీరు పోలీసులతో కలిసి పని చేస్తున్నారన్నారు.

కొత్తగా ఉగ్రవాదంలో చేరినవారి జీవిత కాలం 2022లో బాగా తగ్గిందన్నారు. ఉగ్రవాదంలో చేరినవారిలో దాదాపు 89 శాతం మంది మొదటి నెలలోనే హతులయ్యారన్నారు. 2022లో 100 మంది కొత్తగా ఉగ్రవాదంలో చేరారని, అంతకుముందు సంవత్సరం కన్నా ఇది 37 శాతం తక్కువ అని చెప్పారు. లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థలో 74 మంది చేరాని తెలిపారు. 17 మందిని అరెస్టు చేయగా, 65 మంది హతమయ్యారని, 18 మంది ఇంకా క్రియాశీలంగా ఉన్నారని చెప్పారు.

2022లో కశ్మీరులో 93 కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ జరిగాయని, 172 మంది ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పారు. వీరిలో అత్యధికులు లష్కరే తొయిబా, దాని స్థానిక అనుబంధ సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్‌కు చెందినవారేనని తెలిపారు. హతులైనవారిలో జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, అల్-బదర్, అల్‌ఖైదా అనుబంధ సంస్థ అన్సర్ ఘజ్వాత్-ఉల్-హింద్ ఉగ్రవాద సంస్థలకు చెందినవారు కూడా ఉన్నారని తెలిపారు.

ఉగ్రవాదుల దాడుల్లో 29 మంది పౌరులు మరణించారని, వీరిలో 21 మంది స్థానికులని తెలిపారు. మృతుల్లో 15 మంది ముస్లింలని, ఆరుగురు హిందువులని చెప్పారు. సామాన్యులను హత్య చేసిన ఉగ్రవాదుల్లో బసిత్ దార్, అదిల్ వాని మాత్రమే పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే మట్టుబెడతామని తెలిపారు.

Updated Date - 2022-12-31T16:14:51+05:30 IST