Jaya Bachchan : చదువుకున్న మహిళల్లో రెండు నాలుకల ధోరణి : జయ బచ్చన్

ABN , First Publish Date - 2022-11-19T15:22:10+05:30 IST

మహిళలకు మహిళలే శత్రువులని, చదువుకున్న మహిళలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని బాలీవుడ్ వెటరన్ నటి, సమాజ్‌వాదీ పార్టీ నేత

Jaya Bachchan : చదువుకున్న మహిళల్లో రెండు నాలుకల ధోరణి : జయ బచ్చన్
Jaya Bachan, Swetha Bachan, Navya Naveli Nanda

న్యూఢిల్లీ : మహిళలకు మహిళలే శత్రువులని, చదువుకున్న మహిళలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని బాలీవుడ్ వెటరన్ నటి, సమాజ్‌వాదీ పార్టీ నేత జయ బచ్చన్ అన్నారు. ఆమె ఇటీవల తన మనుమరాలు నవ్య నవేలీ నంద పాడ్‌కాస్ట్‌ ఎపిసోడ్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. కుమార్తెలను పెంచినట్లుగానే కుమారులను కూడా పెంచాలని నవ్య అన్నపుడు ఆమె ఈ విధంగా స్పందించారు.

జయ బచ్చన్, ఆమె కుమార్తె శ్వేత బచ్చన్, మనుమరాలు నవ్య నవేలీ నంద పిల్లల పెంపకం గురించి మాట్లాడారు. నవ్య మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ కుమార్తెలను పెంచినట్లుగానే కుమారులను కూడా పెంచాలని చెప్పారు. జయ జోక్యం చేసుకుని చదువుకున్న మహిళలు కూడా ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నారన్నారు. ఇది చాలా శోచనీయమని చెప్పారు. ఈ విషయాన్ని చెప్పాలని చాలాసార్లు అనుకున్నానని, అయితే బాగుండదని చెప్పలేదని చెప్పారు. ఆడదానికి ఆడదే శత్రువు అన్నారు.

శ్వేత మాట్లాడుతూ, తన తల్లి తన పట్ల అంత బాగా వ్యవహరించరని చెప్పారు. మహిళలు తమ తోటి మహిళలతో మంచిగా ఉండాలన్నారు. సహకారం అందించే విధంగా ఉండాలన్నారు.

జయ స్పందిస్తూ, నవ్యకు తాను చాలా మంచిదాన్నని చెప్పారు. తాను ఎల్లప్పుడూ మహిళలకు సహాయపడుతూనే ఉంటానని, వారి తరపున గళమెత్తుతానని చెప్పారు. తల్లీకూతుళ్ళ గురించి మాట్లాడుకోవద్దన్నారు.

మెడిలీన్ కే అల్‌బ్రైట్ కోట్‌ను శ్వేత ప్రస్తావించారు. ఇతర మహిళలకు సహాయపడని మహిళలకు నరకంలో ప్రత్యేకంగా ఓ ప్రదేశం ఉంటుందని మెడిలీన్ చెప్పారన్నారు. దాతృత్వం ఇంటి నుంచే, తల్లి నుంచే ప్రారంభం కావాలని చెప్పారు.

జయ స్పందిస్తూ, ఓహ్, మూసుకో అన్నారు.

నవ్య జోక్యం చేసుకుని శ్వేత, జయ వేర్వేరు కాదన్నారు.

జయ స్పందిస్తూ, నవ్యను తన పంచింగ్ బ్యాగ్‌గా శ్వేత భావిస్తుందన్నారు.

నవ్య మాట్లాడుతూ, ‘‘నేను రాంగ్ ప్లేస్‌లో, రాంగ్ టైమ్‌లో ఉన్నాను. తప్పుడు విషయాలు మాట్లాడుతున్నాను. భావోద్వేగంతో కూడిన ఆశ్చర్యంతో ఉన్నాను. అది నా తప్పు కాకపోయినా, ఇక్కడ ఉన్నాను. ఆమె ఇక్కడ ఉంది కాబట్టి ఇక నేనే....’’ అన్నారు.

తన కూతురికి ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండాలో తెలియదని, ఎవరు ఎప్పుడు విచారంగా ఉన్నారో తెలియదని శ్వేత అన్నారు.

జయ, శ్వేత, నవ్య వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను నవ్య పాడ్‌కాస్ట్‌లో పంచుకుంటున్నారు. ‘వాట్ ది హెల్ నవ్య’ పేరుతో జరుగుతున్న తొమ్మిదో ఎపిసోడ్ ఇది. ‘వన్ క్రౌన్, మెనీ షూస్’ అనే టాపిక్‌పై ఈ సంభాషణ జరిగింది.

Updated Date - 2022-11-19T15:22:14+05:30 IST