Justice Abhishek Reddy: జస్టిస్‌ అభిషేక్‌ రెడ్డి పాట్నా హైకోర్టుకు బదిలీ!

ABN , First Publish Date - 2022-11-18T03:53:49+05:30 IST

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏ అభిషేక్‌ రెడ్డిని పాట్నా హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది.

Justice Abhishek Reddy: జస్టిస్‌ అభిషేక్‌ రెడ్డి పాట్నా హైకోర్టుకు బదిలీ!

కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు

తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల నిరసన

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏ అభిషేక్‌ రెడ్డిని పాట్నా హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. 1990 నుంచి న్యాయవాద వృత్తిలో ఉన్న జస్టిస్‌ అభిషేక్‌ రెడ్డి 2019 ఆగస్టు 26న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిఖిల ఎస్‌ కరియెల్‌ను కూడా పాట్నా హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రానికి కొలీజియం సిఫారసు చేసింది. అయితే జస్టిస్‌ అభిషేక్‌ రెడ్డి బదిలీకి సిఫార్సుపై తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. గురువారం, శుక్రవారం రెండు రోజులు విధులు బహిష్కరిస్తున్నామని తెలిపారు. చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ నేతృత్వంలోని మొదటి కోర్టుకు వెళ్లిన న్యాయవాదులు తమ నిర్ణయాన్ని ఆయనకు తెలియజేశారు. అధ్యక్షుడు వీ రఘునాథ్‌ మాట్లాడుతూ తెలంగాణ హైకోర్టుకు చెందిన జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావు, జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌ ఇలా ఒకరి తర్వాత ఒకరిని బదిలీ చేస్తున్నారన్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులకు అన్యాయం జరుగుతోందని చీఫ్‌ జస్టి్‌సకు తెలిపారు. న్యాయవాదులు అందరూ కోర్టును వీడాలని విజ్ఞప్తి చేశారు. న్యాయవాదులు ఎవరూ లేకపోవడంతో ధర్మాసనం తదుపరి ప్రొసీడింగ్స్‌ చేపట్టలేదు. ఇతర న్యాయమూర్తుల కోర్టుల్లో సైతం విధులు బహిష్కరించారు. అనంతరం హైకోర్టు వద్ద ధర్నా నిర్వహించారు.

Updated Date - 2022-11-18T03:53:50+05:30 IST