Kerala Human Sacrifice: కేరళలో సంచలనం సృష్టించిన నరబలి కేసులో తాజా అప్డేట్ ఏంటంటే...

ABN , First Publish Date - 2022-10-12T22:12:17+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మదనపల్లె జంట హత్యల కేసు గుర్తుండే ఉంటుంది. కన్న తల్లిదండ్రులే మూఢ నమ్మకాల ఊబిలో..

Kerala Human Sacrifice: కేరళలో సంచలనం సృష్టించిన నరబలి కేసులో తాజా అప్డేట్ ఏంటంటే...
నిందితులు భగవల్ సింగ్, లైలా

ఎర్నాకుళం: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మదనపల్లె జంట హత్యల కేసు గుర్తుండే ఉంటుంది. కన్న తల్లిదండ్రులే మూఢ నమ్మకాల ఊబిలో చిక్కుకుని యుక్త వయసులో ఉన్న ఇద్దరు కన్న కూతుర్లను పొట్టనపెట్టుకున్న ఘటన అది. అలాంటి ఘటనే.. కేరళ రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది. ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సైన్స్ అండ్ టెక్నాలజీ దినదినాభివృద్ధి చెందుతున్న ఈరోజుల్లో కూడా నరబలి పేరుతో ఇద్దరు మహిళలను అమానుషంగా చంపిన ఘటన కావడంతో సంచలనంగా మారింది. ఈ ఘటనకు బాధ్యులైన నిందితులకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ముగ్గురు నిందితులకు ఎర్నాకుళం కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. నరబలి నిందితుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. మూఢ నమ్మకాలతో ఇద్దరు మహిళలను దంపతులు బలిచ్చారు. రోస్లిన్ అనే మహిళను 56 ముక్కలు, పద్మను 5 ముక్కలు చేసి ఈ ఘటన గురించి తెలిసివాళ్లకు ఒళ్లుగగుర్పొడిచేలా చేశారు. నరబలి చేశాక వారి శరీర అవయవాలను ముగ్గురు నిందితులు తిన్నారు. జూన్ 8, సెప్టెంబర్ 26న సాయంత్రం సమయంలో నరబలి ఘటనలు జరిగాయి. నరబలి ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని కేరళ సీఎం విజయన్ ఆదేశించారు. త్వరగా కేసు ముగించాలని సీఎం పినరయి విజయన్ ఆదేశించారు.



ఈ ఘటనకు సంబంధించి పూర్వాపరాల్లోకి వెళితే.. కేరళలోని ఎర్నాకుళం జిల్లాకు చెందిన రోస్లిన్, పద్మ ఇద్దరు మహిళలు జిల్లాలోని వేరువేరు ప్రాంతాల్లో నివసించేవాళ్లు. వీరిద్దరికీ ఎలాంటి సంబంధం లేదు. లైలా, భగవల్ సింగ్ అనే దంపతులు మూఢ నమ్మకాల మత్తులో నరబలి ఇస్తే ధనవంతులవుతారని భావించి ఈ ఇద్దరు మహిళలను కిరాతకంగా హత్య చేశారు. హత్య చేసిన తరువాత.. రోస్లిన్ అనే మహిళను 56 ముక్కలు, పద్మను 5 ముక్కలు చేశారు. పాతనమిట్ట జిల్లాలోని ఎలంతూరు గ్రామంలో ఉన్న ఈ దంపతుల ఇంటి పెరట్లో మృతదేహాలను గొయ్యి తవ్వి పూడ్చేశారు. ఈ దంపతులు ఈ దుశ్చర్యకు పాల్పడటానికి కారణమైన మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి వీరితో పాటు కోర్టులో హాజరుపరిచారు. అక్షరాస్యతలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే కేరళ లాంటి పురోగతి చెందిన రాష్ట్రంలో ఇలాంటి మూఢ నమ్మకాలకు సాక్ష్యంగా నిలిచే ఘటన జరగడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నివ్వెరపోయారు.

Updated Date - 2022-10-12T22:12:17+05:30 IST