తండ్రిని చంపి.. 32 ముక్కలు చేసి!
ABN , First Publish Date - 2022-12-14T01:03:38+05:30 IST
ఢిల్లీలో శ్రద్ధా వాకర్ అనే యువతిని ఆమె ప్రియుడే ముక్కలుగా నరికి చంపిన ఘటనను మరచిపోకముందే కర్ణాటకలోనూ అలాంటి ఒళ్లు గగుర్పొడిచే దారుణ ఘటన వెలుగు చూసింది.
మద్యం తాగొద్దని మందలించాడని ఘోరం
కర్ణాటకలోని బాగల్కోటెలో దారుణం
బెంగళూరు, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో శ్రద్ధా వాకర్ అనే యువతిని ఆమె ప్రియుడే ముక్కలుగా నరికి చంపిన ఘటనను మరచిపోకముందే కర్ణాటకలోనూ అలాంటి ఒళ్లు గగుర్పొడిచే దారుణ ఘటన వెలుగు చూసింది. జన్మనిచ్చిన తండ్రిని అంతమొందించి, 32 ముక్కలుగా నరికి బోరుబావిలో పడేసిన కిరాతక కుమారుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బాగల్కోటె జిల్లా ముథోళనగర్కు చెందిన పరశురామ కుళలి(54) వారం రోజులుగా కనిపించడం లేదని ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యసనాలకు బానిసైన తన కుమారుడిపై అనుమానం ఉందని పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఆమె కుమారుడు విఠల్ కుళలిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ నెల 6న అర్ధరాత్రి ఇనుప రాడ్తో తలపై మోది తండ్రిని హతమార్చానని విఠల్ తెలిపాడు. మృతదేహాన్ని పూడ్చిపెట్టేందుకు సాధ్యం కాకపోవడంతో బోరుబావిలోకి వేసేందుకు ప్రయత్నించానని వివరించాడు. మృతదేహం బోరుబావిలో పట్టకపోవడంతో 32 ముక్కలుగా నరికానని ఒప్పుకున్నాడు. మద్యం మత్తులోనే ఇదంతా చేశానని విచారణలో వెల్లడించాడు. నిత్యం మద్యం తాగి ఇంటికి వెళుతుంటానని, ఈ కారణంగా తండ్రి పదేపదే తిడుతుండటంతో కోపం పట్టలేకే హత్య చేశానని అంగీకరించాడు.