స్వామిజీ ఎంగిలి పదార్థం తిన్న ఎమ్మెల్యే జమీర్
ABN , First Publish Date - 2022-05-23T18:40:03+05:30 IST
ఓ స్వామిజీ నోట్లో పెట్టుకున్న ఆహారాన్ని బయటకు తీయించి అదే పదార్థాన్ని స్వామిజీ చేత ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ నోట్లో పెట్టించుకున్నారు

బెంగళూరు, మే 22 (ఆంధ్రజ్యోతి): ఓ స్వామిజీ నోట్లో పెట్టుకున్న ఆహారాన్ని బయటకు తీయించి అదే పదార్థాన్ని స్వామిజీ చేత ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ నోట్లో పెట్టించుకున్నారు. తరచూ ఏదో ఒక వివాదంలోనూ, ఆవేశపూరిత వ్యాఖ్యలు చేసే జమీర్ అహ్మద్ మరోసారి అటువంటి ప్రక్రియ సాగించారు. ఆదివారం చామరాజపేట నియోజకవర్గం పరిధిలో ఈద్ మిలన్ - అంబేడ్కర్ జయంతి కార్యక్రమాలు జరిగాయి. ఉత్తరప్రదేశ్లో దళితులకు దేవాలయ ప్రవేశం నిషేధం, ప్రసాదం ఇవ్వకపోవడంపై తీవ్రంగా ఖండించారు. ఇదే సందర్భంలో దళిత మఠం నారాయణ స్వామిజీ ఎంగిలి ఆహారాన్ని సేవించడం ద్వారా ఉత్తరప్రదేశ్ సంఘటనను తీవ్రంగా వ్యతిరేకించారు.
అన్ని కులాలు, మతాలను ఒకే విధంగా చూడాలని మహాత్మాగాంధీ కలలు కన్నారన్నారు. అప్పుడే దేశం అభివృద్ధి సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను సమానంగా చూస్తుందన్నారు. బీజేపీ వ్యవహారాలు భిన్నంగా ఉన్నాయని మండిపడ్డారు. ఇదే సందర్భంలో పాదరాయనపుర బీబీఎంపీ బాలికల కళాశాలలో రూ.2కోట్లతో నిర్మాణాలకు భూమిపూజ చేశారు. ఏడుమంది దివ్యాంగులకు ద్వి చక్రవాహనాలను అందజేశారు.