Birthday Wishes : అద్వానీకి మోదీ, రాజ్‌నాథ్ సింగ్ జన్మదిన శుభాకాంక్షలు
ABN , First Publish Date - 2022-11-08T12:28:48+05:30 IST
మాజీ ఉప ప్రధాన మంత్రి, బీజేపీ అగ్ర నేత లాల్ కృష్ణ అద్వానీ (LK Advani)కి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), రక్షణ
న్యూఢిల్లీ : మాజీ ఉప ప్రధాన మంత్రి, బీజేపీ అగ్ర నేత లాల్ కృష్ణ అద్వానీ (LK Advani)కి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) మంగళవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అద్వానీ 95వ జన్మదినం సందర్భంగా ఆయన నివాసానికి మోదీ, సింగ్ వెళ్లారు. ఆయనకు గులాబీపూల పుష్పగుచ్ఛాలను ఇచ్చి, శుభాకాంక్షలు తెలిపారు.
అద్వానీ నివాసంలో ఆయనతోపాటు మోదీ సుమారు 30 నిమిషాలపాటు ఆహ్లాదంగా గడిపారు. ఇరువురు ముచ్చటించుకున్నారు. అంతకుముందు వీరికి అద్వానీ కుమార్తె ప్రతిభ అద్వానీ స్వాగతం పలికారు.
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) ఇచ్చిన ట్వీట్‌లో, అద్వానీ తన జీవితాన్ని దేశానికి, సంస్థకు అంకితం చేశారని, అది తమకు ప్రేరణనిస్తోందని పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) కూడా అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అద్వానీ నిరంతర శ్రమతో దేశవ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేశారన్నారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ, దేశాభివృద్ధికి ఎంతో సేవ చేశారని పేర్కొన్నారు.
అద్వానీ 1927 నవంబరు 8న ప్రస్తుత పాకిస్థాన్‌లోని కరాచీలో జన్మించారు. దేశ విభజన అనంతరం ఆయన కుటుంబం ముంబైకి వచ్చేసింది. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఆయన ఒకరు. 2002 నుంచి 2004 మధ్య కాలంలో అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వంలో అద్వానీ ఉప ప్రధాన మంత్రిగా పని చేశారు. గడచిన మూడు దశాబ్దాల్లో బీజేపీ ఎదుగుదల కోసం ఆయన విశేషంగా కృషి చేశారు. లోక్‌సభలో ఇద్దరు సభ్యులు మాత్రమే ఉండే పరిస్థితి నుంచి 2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి బీజేపీని తీర్చిదిద్దిన ఘనతలో ఆయన ప్రధాన భాగస్వామి. అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలన్న డిమాండ్‌తో ఆయన రథయాత్ర నిర్వహించారు. రాజస్థాన్‌లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) కార్యకర్తగా పని చేశారు. ఆయన ఢిల్లీ, గుజరాత్‌ల నుంచి ఎన్నికల్లో గెలిచారు.
అద్వానీకి ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. ఆయన సతీమణి 2016లో మరణించారు. భారత ప్రభుత్వం ఆయనను 2015లో పద్మ విభూషణ్‌తో సత్కరించింది.