Myanmar : హైస్కూల్ టీచర్ తల తెగనరికిన మయన్మార్ సైన్యం

ABN , First Publish Date - 2022-10-21T20:13:57+05:30 IST

మయన్మార్‌లో సైనిక పాలకుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది.

Myanmar : హైస్కూల్ టీచర్ తల తెగనరికిన మయన్మార్ సైన్యం

న్యూఢిల్లీ : మయన్మార్‌లో సైనిక పాలకుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. తమకు వ్యతిరేకంగా గళమెత్తినవారిని దారుణంగా అణచివేస్తోంది. ప్రజలు ఎన్నుకున్న అంగ్ సాన్ సూ చీ ప్రభుత్వాన్ని కూల్చేసి, అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పటి నుంచి వేలాది మందిని అరెస్టు చేసింది. తాజాగా గ్రామీణ ప్రాంతంలోని ఓ హైస్కూలు ఎదుట ఆ పాఠశాలలో పని చేసే టీచర్‌ మృతదేహం కనిపించింది. తల, మొండెంలను వేరు చేసి, మొండెం పైన తలను ఉంచారు. ఈ టీచర్ మరణానికి కారణాన్ని సైన్యం వెల్లడించలేదు. 


దారుణ హత్యకు గురైన టీచర్‌ సా టున్ మొయీ (Saw Tun Moe) (46) మయన్మార్‌లోని రూరల్ మేగ్వే ప్రాంతంలో ఉన్న టవుంగ్ మ్యింట్ గ్రామంలోని హైస్కూల్‌లో పని చేస్తున్నారు. ఆయన తలను మొండెం నుంచి వేరు చేసి, నేలపైన మొండెంను పడేసి, దానిపైన ఆ తలను పెట్టారు. ఓ సంవత్సరం నుంచి మూతపడిన  ఆ హైస్కూలును కూడా తగులబెట్టారు. ఈ టీచర్ హత్యకు కారణాలను సైనిక ప్రభుత్వం కానీ, ప్రభుత్వ నియంత్రణలోని మీడియా గానీ వెల్లడించలేదు. 


ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని 2021లో కూల్చేసి సైన్యం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి సైన్యం దాదాపు 2,300 మంది సాధారణ పౌరులను హత్య చేసిందని, వేలాది మందిని అరెస్టు చేసిందని ఆరోపణలు వస్తున్నాయి. 


అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ (Ned Price) ఇచ్చిన ట్వీట్‌లో, బర్మా (మయన్మార్) సైనిక ప్రభుత్వం మేగ్వేలోని ఓ స్కూల్ టీచర్‌ను అరెస్టు చేసి, బహిరంగంగా తల నరికినట్లు వచ్చిన వార్తలు దిగ్భ్రాంతి కలిగించాయని చెప్పారు. విద్యావేత్తలు, ఉపాధ్యాయులతో సహా అనేక మందిపై సైనిక ప్రభుత్వం కిరాతకంగా హింసకు పాల్పడుతుండటాన్ని ఖండించారు. అంతర్జాతీయ సమాజం గట్టిగా స్పందించాలని కోరారు. 


ఐక్య రాజ్య సమితి బాలల హక్కుల కమిటీ జూన్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం, సైనిక పాలన ప్రారంభమైన తర్వాత పాఠశాలలు, విద్యా సంస్థల సిబ్బందిపై దాదాపు 260 దాడులు జరిగాయని తెలుస్తోంది. 


Updated Date - 2022-10-21T20:13:57+05:30 IST