దేవాస్ తీర్పుతో మోదీ ప్రభుత్వానికి ఊరట

ABN , First Publish Date - 2022-01-18T19:12:16+05:30 IST

నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రైబ్యునల్ (NCLAT) తీర్పుపై

దేవాస్ తీర్పుతో మోదీ ప్రభుత్వానికి ఊరట

న్యూఢిల్లీ : నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రైబ్యునల్ (NCLAT) తీర్పుపై దేవాస్ మల్టీమీడియా దాఖలు చేసిన అపీలును సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం గొప్ప ఉపశమనం పొందింది. ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉండకపోతే చాలా నష్టం జరిగి ఉండేదని జాతీయ మీడియా పేర్కొంది.  ఈ కంపెనీని మూసివేయాలని NCLAT ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. 


జాతీయ మీడియా కథనాల ప్రకారం, దేవాస్ మల్టీమీడియాకు లభించిన ఆర్బిట్రేషన్ అవార్డుకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం నెదర్లాండ్స్ కోర్టులో కేసు దాఖలు చేసింది. మోసం జరిగిందనే ఆరోపణలపై దేవాస్ మల్టీమీడియాను లిక్విడేషన్ చేయాలని కోరుతూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వాణిజ్య విభాగం ఆంట్రిక్స్ NCLATని ఆశ్రయించే విధంగా మోదీ ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకుంది. ఇటువంటి చర్యలు తీసుకోకపోయి ఉంటే దేవాస్‌పై ప్రభుత్వం దాఖలు చేసిన కేసు బలహీనపడి ఉండేది. 


దేవాస్-ఆంట్రిక్స్ ఒప్పందంపై 2005లో సంతకాలు జరిగాయి. దీనిని డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం 2011లో రద్దు చేసింది. అవినీతి ఆరోపణలు రావడంతో  ఈ నిర్ణయం తీసుకుంది. కానీ నేషనల్ సెక్యూరిటీ క్లాజును వినియోగించలేదు. సుప్రీంకోర్టు తీర్పుతో భారత దేశ వాదనకు అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోంది. యూపీఏ ప్రభుత్వం వదిలిపెట్టిన గందరగోళాన్ని సరి చేయడానికి మోదీ ప్రభుత్వం చాలా శ్రమించింది. 


యూపీఏ ప్రభుత్వం చమురు కంపెనీలకు చెల్లించవలసిన సొమ్మును చెల్లించకుండా, దానికి బదులుగా రూ.1.3 లక్షల కోట్ల విలువైన ఆయిల్ బాండ్లను జారీ చేసింది. ఆ ప్రభుత్వ తప్పుడు నిర్వహణ ఫలితంగా మోదీ ప్రభుత్వం సంవత్సరానికి దాదాపు రూ.10,000 కోట్ల మేరకు వడ్డీ చెల్లిస్తోంది. అదేవిధంగా గత కాలం నుంచి వర్తించే పన్నుల విధానం, రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం, ద్రవ్య లోటు పెరిగిపోవడం వంటి సమస్యలను పరిష్కరించడానికి మోదీ ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. 


Updated Date - 2022-01-18T19:12:16+05:30 IST