P. Sushila: పండుగలకు పుట్టినిల్లు భారతదేశం
ABN , First Publish Date - 2022-08-21T14:16:12+05:30 IST
‘శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో 24వ వార్షిక కృష్ణాష్టమి వేడుకలు శనివారం రాత్రి చెన్నై మ్యూజిక్ అకాడమీ వేదికగా ఘనంగా జరిగాయి. ఈ
ప్యారీస్(చెన్నై), ఆగస్టు 20: ‘శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో 24వ వార్షిక కృష్ణాష్టమి వేడుకలు శనివారం రాత్రి చెన్నై మ్యూజిక్ అకాడమీ వేదికగా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షుడు బేతిరెడ్డి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ వేడుకలకు గౌరవ అతిథులుగా సీనియర్ నేపథ్యగాయని, పద్మభూషణ్ పి.సుశీల(Padma Bhushan P. Sushila), ఆలిండియా తెలుగు ఫెడరేషన్ (ఏఐటీఎఫ్) అధ్యక్షుడు డా.సీఎంకే రెడ్డి, బీజేపీ జాతీయ నాయకురాలు కరుణా గోపాల్, వరల్డ్ తెలుగు ఫెడరేషన్-చెన్నై మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్.జయశ్రీరావు పాల్గొన్నారు. ముందుగా అంబికా అనంత్ రచించిన ‘శ్రీకృష్ణ కర్ణామృతం’ పుస్తకాన్ని పి.సుశీల ఆవిష్కరించగా, తొలిప్రతిని సీఎంకే రెడ్డి స్వీకరించారు. ఈ సందర్భంగా పి.సుశీల మాట్లాడుతూ... భారతదేశం పండుగలకు పుట్టినిల్లు అని, సంస్కృతి సంప్రదాయాలకు శ్రీ కళా సుధ వ్యవస్థాపక అధ్యక్షుడు బేతిరెడ్డి శ్రీనివాస్ అద్దం పడుతున్నారని అభినందించారు. మా మాటలు పాటలు లాగే ఉంటాయని, శ్రీ కృష్ణుడు, శ్రీరాముడు, సత్యసాయి కృపాకటాక్షం వల్లే ఆరోగ్యంగా జీవించగలుగుతున్నానని అన్నారు. బేతిరెడ్డి నిర్వహించే కార్యక్రమాల ద్వారా చెన్నైలో తెలుగు భాషకు తగిన గుర్తింపు లభిస్తోందన్నారు. ‘కృష్ణా....’ అంటూ పాటను పాడి ప్రతి ఒక్కరూ అనుసరించాలని కోరారు. కరుణా గోపాల్ మాట్లాడుతూ... భగవద్గీతను ప్రతి ఒక్కరూ చదవాలన్నారు. కృష్ణపరమాత్ముడు ప్రేమ, ఆప్యాయతలు కురిపించాలని, సమాజానికి సేవ చేయాలని ఉపదేశించారని, దానిని ప్రతి ఒక్కరూ అనుసరించాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన పలువురికి ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. ఇందులో ప్రముఖ రచయిత్రి అంబికా అనంత్‌కు, జ్యువెలరీస్ అండ్ డైమండ్ ట్రేడర్స్ అసోసియేషన్-చెన్నై అధ్యక్షుడు జయంతిలాల్ చలానికి, మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు అనారోగ్యం కారణంగా రాలేక పోయినందున, ఆయన ప్రతినిధిగా విచ్చేసిన మహా సిమెంట్ ఏజీఎం-మార్కెటింగ్ శ్రీనివాస్ లకు వెండి కిరీటం, జ్ఞాపికతో విశిష్ట ప్రతిభా పురస్కారాలను పి.సుశీల, డా.సీఎంకే రెడ్డి సంయుక్తంగా బహూకరించి ఘనంగా సత్కరించారు. ప్రార్థనాగీతం ప్రముఖ గాయని శ్రేయా రామనాథ్(Shreya Ramanath) ఆలపించారు. ఈ సందర్భంగా శ్రేయా రామనాథ్, శ్రీ వర్ధిని తమన్, హరిప్రియ, రాశిని పెండ్యాల తదితరులకు జ్ఞాపికలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పి.సుశీలను కూడా ఘనంగా సత్కరించారు.