ప్రచార సభలకు వెయ్యి మందికి అనుమతి

ABN , First Publish Date - 2022-02-05T15:14:34+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచార సభలకు మరిన్ని సడలింపులు వచ్చాయి. ఈ సభలకు వెయ్యిమంది వరకు వెళ్లవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. ఇటీవల రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టడంతో

ప్రచార సభలకు వెయ్యి మందికి అనుమతి

                                  - 20 మందితో ఇంటింటి ప్రచారం


చెన్నై: మున్సిపల్‌ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచార సభలకు మరిన్ని సడలింపులు వచ్చాయి. ఈ సభలకు వెయ్యిమంది వరకు వెళ్లవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. ఇటీవల రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇక అభ్యర్థులు ఇంటింటి ప్రచారానికి చేయడానికి 20 మందిని మాత్రమే అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో పాద యాత్రలు, బైకు ర్యాలీలపై ఈ నెల 11 వరకు నిషేధం విధించింది. ప్రచార సభలకు విశాలమైన ప్రాంతాలను ఎంపిక చేయాలని, లేకుంటే సభలకు అనుమతి లభించదని తెలిపింది. ప్రతి ప్రచార సభ ప్రాంగణంలోను 1000 మందికి మాత్రమే అనుమతిస్తారని, ప్రాంగణంలో యాభైశాతం స్థలంలో మాత్రమే జనం ఉండాలని ఎన్నికల సంఘం నిబంధన విధించింది. ప్రచార సభలు ఇండోర్‌ స్టేడియం, హాళ్లలో ఏర్పాటు చేస్తే 500 మందికి మాత్రమే అనుమతించనున్నట్లు పేర్కొంది. అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు ప్రచార సమయాల్లో కొవిడ్‌ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, సక్రమంగా పాటిస్తున్నారో లేదో ఎన్నికల పర్యవేక్షకులు పరిశీలిస్తారని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.


రూ.2లక్షల వరకు అనుమతించండి...

ఎన్నికల సమయంలో వ్యాపారులు రూ.2లక్షల వరకు తీసుకెళ్లేందుకు అనుమతించాలంటూ రాష్ట్ర ఎన్నికల అధికారి పళనికుమార్‌కు రాష్ట్ర వాణిజ్య సంఘాల సమాఖ్య నాయకుడు విక్రమరాజా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఎన్నికల అధికారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ ఎన్నికల్లో రూ.50 వేలకు మించి నగదును తీసుకెళ్లకూడదంటూ ఎన్నికల నియమావళిలో ప్రకటించారు. దీని కారణంగా వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని, నెలసరి వస్తువుల కొనుగోళ్లకు రెండు లక్షల దాకా తీసుకెళుతుండేవారని, ప్రస్తుతం యాభైవేలతో తక్కువ సరకులు కొనాల్సి వస్తోందన్నారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం వ్యాపారుల సంక్షేమం దృష్ట్యా నగదు తరలింపు నిబంధన సడలించాలని విక్రమరాజా కోరారు.

Updated Date - 2022-02-05T15:14:34+05:30 IST