Dalai Lama : దలైలామాపై కుట్రపన్నిన మహిళ ఫొటో విడుదల

ABN , First Publish Date - 2022-12-29T14:32:59+05:30 IST

బిహార్‌లోని బుద్ధ గయలో పర్యటిస్తున్న బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా (Dalai Lama) భద్రతకు ముప్పు కలిగించేందుకు

Dalai Lama : దలైలామాపై కుట్రపన్నిన మహిళ ఫొటో విడుదల
Dalai Lama, Song Xiaolan

న్యూఢిల్లీ : బిహార్‌లోని బుద్ధ గయలో పర్యటిస్తున్న బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా (Dalai Lama) భద్రతకు ముప్పు కలిగించేందుకు ఓ మహిళ కుట్ర పన్నినట్లు అనుమానం వ్యక్తమవుతోందని పోలీసులు వెల్లడించారు. ఆ మహిళ చైనా జాతీయురాలని, ఆమె పేరు సోంగ్ షియావోలన్ (Song Xiaolan) అని తెలిపారు. ఆమె రూపురేఖలతో కూడిన స్కెచ్‌ను కూడా విడుదల చేశారు.

టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా గత గురువారం నుంచి బిహార్‌ (Bihar)లోని బుద్ధ గయ (Bodh Gaya)లో పర్యటిస్తున్నారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా రెండేళ్ళపాటు ఆయన ఈ సుప్రసిద్ధ బౌద్ధ క్షేత్రంలో పర్యటించలేదు. అంతకుముందు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి, ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవారు. గత గురువారం ఆయనకు గయ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. జిల్లా మేజిస్ట్రేట్ త్యాగరాజన్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హర్‌ప్రీత్ కౌర్, ఆయన అనుచరులు ఆయనకు స్వాగతం పలికారు. ఆయన టిబెటన్ మానెస్టరీకి వెళ్ళే వరకు పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిల్చుని స్వాగతం పలికారు.

దలైలామా డిసెంబరు 29 నుంచి 31 వరకు కాలచక్ర మైదానంలో ఉపన్యాసాలు ఇస్తారు. ఆయన భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 2018 జనవరిలో ఇక్కడ తక్కువ తీవ్రతగల పేలుడు జరిగిన నేపథ్యంలో పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఆయన ఉపన్యాసాల కోసం ప్రపంచం నలుమూలల నుంచి అనేక మంది వస్తారు, అందువల్ల కోవిడ్ నిబంధనలను పాటించాలని ప్రజారోగ్య శాఖ కోరింది.

దలైలామాకు హాని కలిగించేందుకు చైనా మహిళ సోంగ్ కుట్ర పన్నినట్లు అనుమానం వ్యక్తమవుతోందని పోలీసులు తెలిపారు. ఆమె రూపురేఖలతో కూడిన ఓ స్కెచ్‌ను విడుదల చేశారు.

Updated Date - 2022-12-29T15:25:18+05:30 IST