Nepal : నేపాల్ నూతన ప్రధానిగా ప్రచండ ప్రమాణ స్వీకారం సోమవారం
ABN , First Publish Date - 2022-12-25T20:24:51+05:30 IST
నేపాల్ నూతన ప్రధాన మంత్రిగా సీపీఎన్-మావోయిస్ట్ సెంటర్ చైర్మన్ పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’
ఖాట్మండు : నేపాల్ నూతన ప్రధాన మంత్రిగా సీపీఎన్-మావోయిస్ట్ సెంటర్ చైర్మన్ పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ (Pushpa Kamal Dahal ‘Prachanda’) ఆదివారం నియమితులయ్యారు. నేపాల్ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారీ రాజ్యాంగంలోని అధికరణ 76 క్లాజ్ 2 ప్రకారం ఆయనను నియమించినట్లు అధ్యక్ష కార్యాయలం ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన సోమవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేస్తారని పేర్కొంది.
రెండు లేదా అంతకన్నా ఎక్కువ పార్టీల మద్దతును స్వీకరించి, ప్రతినిధుల సభలో ఆధిక్యతను సాధించగలిగే సభ్యుడిని ప్రధాన మంత్రి పదవిలో నియమించేందుకు నేపాల్ ప్రెసిడెంట్ ఆహ్వానించవచ్చునని రాజ్యాంగంలోని అధికరణ 76 క్లాజ్ 2 చెప్తోంది. ఆదివారం సాయంత్రం ఐదు గంటల్లోగా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలని ప్రెసిడెంట్ అంతకుముందు ఆదేశించారు. ప్రభుత్వ ఏర్పాటుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఓ లేఖను ప్రచండ ఈ గడువు ముగియక ముందే సమర్పించారు. ప్రెసిడెంట్ కార్యాలయానికి వెళ్ళినవారిలో ప్రచండతోపాటు సీపీఎన్-యూఎంఎల్ చైర్మన్ కేపీ శర్మ ఓలీ, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ప్రెసిడెంట్ రవి లమిచానే, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ చీఫ్ రాజేంద్ర లింగ్డెన్ తదితరులు ఉన్నారు. ప్రచండను ప్రధాన మంత్రిగా నియమించాలని వినతి పత్రాన్ని సమర్పించారు.
నేపాల్ ప్రతినిధుల సభ (House of Representatives)లో 275 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 165 మంది ప్రచండకు మద్దతు పలికారు. సీపీఎన్-యూఎంఎల్ (78), సీపీఎన్-ఎంసీ (32), ఆర్ఎస్‌పీ (20), ఆర్‌పీపీ (14), జేఎస్‌పీ (12), జనమత్ (6), నాగరిక్ ఉన్ముక్తి పార్టీ (3) ఆయనకు మద్దతిస్తున్నాయి. మాజీ ప్రధాన మంత్రి ఓలీ నివాసంలో జరిగిన సమావేశంలో ఈ పార్టీల నేతలంతా పాల్గొన్నారు. ప్రచండ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.
ప్రచండ సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని నేపాల్ ప్రెసిడెంట్ కార్యాలయం ప్రకటించింది. ఆయన ఈ పదవిని చేపట్టడం ఇది మూడోసారి. ఆయన 1954 డిసెంబరు 11న కస్కి జిల్లా, ధికుర్పొఖారిలో జన్మించారు. ఆయన దాదాపు 13 ఏళ్ళపాటు రహస్య జీవితం గడిపారు. సీపీఎన్-మావోయిస్ట్ దాదాపు ఓ దశాబ్దంపాటు (1996-2006) జరిపిన సాయుధ తిరుగుబాటును ముగించి, శాంతియుత రాజకీయాల బాట పట్టడంతో ఆయన ప్రధాన రాజకీయాల్లో చేరారు.
2006లో శాంతి ఒప్పందం కుదరడంతో ఆయన నేతృత్వంలోని సాయుధ తిరుగుబాటుకు తెరపడింది.