ముస్లిం మహిళలు మా వెంటే

ABN , First Publish Date - 2022-02-11T08:17:33+05:30 IST

హిజాబ్‌ వివాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. నేరుగా కాంగ్రెస్‌, ఎస్పీలపై మరోసారి తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. ‘‘త్రిపుల్‌ తలాక్‌ వ్యవహారంలో మా వెంట ముస్లిం మహిళలు నిలవడం కొందరికి కడుపునొప్పిగా ఉంది’’

ముస్లిం మహిళలు  మా వెంటే

  • ’‘త్రిపుల్‌ తలాక్‌’పై మాతోనే ఉన్నారు.. అందుకే కొందరికి కడుపు నొప్పి
  • ’ముస్లిం మహిళల కట్టడికి కొత్తఎత్తు
  • ‘హిజాబ్‌’పై ప్రధాని మోదీ పరోక్ష వ్యాఖ్య
  • వారి పురోగతిని అడ్డుకోవాలని యత్నం
  • మత ఘర్షణల రహిత రాష్ట్రంగా యూపీ
  • ఆ బాధ్యతను యోగి తీసుకుంటారు
  • మత అల్లరి మూకలకు అఖిలేశ్‌ టికెట్లు
  • అధికారంలో ఉంటే కరోనా వ్యాక్సిన్లను బజారులో పెట్టి విక్రయించేవాళ్లు 
  • యూపీ ప్రచారంలో కాంగ్రెస్‌, ఎస్పీపై ప్రధాని మోదీ ధ్వజం


షహరన్‌పూర్‌, ఫిబ్రవరి 10 : హిజాబ్‌ వివాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. నేరుగా కాంగ్రెస్‌, ఎస్పీలపై మరోసారి తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. ‘‘త్రిపుల్‌ తలాక్‌ వ్యవహారంలో మా వెంట ముస్లిం మహిళలు నిలవడం కొందరికి కడుపునొప్పిగా ఉంది’’ అంటూ ఎద్దేవా చేశారు. తొలిదశ పోలింగ్‌ ముగిసి రెండోదశలోకి అడుగుపెట్టిన ఉత్తరప్రదేశ్‌లో గురువారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. షహరన్‌పూర్‌లో జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత ఆయన పాల్గొన్న తొలి ఎన్నికల ప్రచార సభ ఇదే. ఈ సందర్భంగా రాజకీయ ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలు గుప్పించారు.  ‘‘ఇప్పుడిప్పుడే హక్కులను, అభివృద్ధిని సాధించుకుంటున్న ముస్లిం మహిళలను అడ్డుకోవడానికే ఇలాంటి కొత్త ఎత్తులు వేస్తున్నారు’’ అంటూ కర్ణాటకను రగిలిస్తున్న హిజాబ్‌ ధారణ అంశాన్ని పరోక్షంగా ఆయన ప్రస్తావించారు. ముస్లిం మహిళల భద్రతకు ఆదిత్యనాథ్‌ యోగి ప్రభుత్వంలోనే భరోసా దొరుకుతుందన్నారు.


‘‘ త్రిపుల్‌ తలాక్‌ నుంచి ముస్లిం మహిళలకు బీజేపీ ప్రభుత్వం విముక్తి కలిగింది. వాళ్లంతా కలిసి మోదీ సర్కారును బలపరచడం కొందరిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అయినా.. మేం ప్రతి ముస్లిం మహిళ వెంట నిలబడతాం’’ అని వ్యాఖ్యానించారు. ఎవరైతే యూపీని మత అల్లర్ల రహిత రాష్ట్రంగా తయారుచేశారో, ఎవరైతే భయం లేని పరిస్థితిని తల్లీబిడ్డలకు కల్పించారో, ఎవరైతే రాష్ట్ర పురోగతికి బాటలు వేశారో, ఎవరైతే నేరస్థులను జైళ్లకు పంపించారో వారినే గెలిపించాలని యూపీ ఓటరు ఇప్పటికే నిర్ణయానికి వచ్చారని మోదీ తెలిపారు.  కాగా, యోగి ప్రభుత్వంలో పేదలు రూ.ఐదులక్షల వరకు మంచి వైద్యశాలలో చికిత్సను ఉచితంగా పొందుతున్నారనీ, యూపీలో యోగి ఉండటం వల్లే కేంద్రం అందించే పీఎమ్‌ కిసాన్‌ యోజన పథకం లబ్ధి చివరి పేద రైతు వరకూ చేరుతున్నదని, ప్రతి పేదవాడూ పీఎం అవాస్‌ యోజన కింద సొంత ఇంటిని ఏర్పాటు చేసుకుంటున్నాడనీ, దశాబ్దకాలంలో ఎన్నడూ అందుకోనంత ధరను చెరుకు రైతులు ఇప్పుడు పొందుతున్నారని మోదీ ఏకరవు పెట్టారు.


కరోనా సమయంలో పూర్తి ఉచితంగా రేషన్‌ అందించామన్న ఆయన.. అదేగనుక ఆ సమయంలో ‘కుటుంబ వారసత్వ వాదులు’ యూపీలో అధికారంలో ఉంటే కొవిడ్‌ వ్యాక్సిన్లను బజారులోపెట్టి విక్రయించేవారని వ్యాఖ్యానించారు. అటు.. ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్‌, గోవాల్లో జరిగిన ప్రచార సభల్లోనూ ప్రధాని పాల్గొన్నారు. జనరల్‌ రావత్‌ను రోడ్డుసైడ్‌ పోకిరీ అంటూ తిట్టినవారే ఇప్పుడు ఆయన కటౌట్లు పెట్టుకుని ఉత్తరాఖండ్‌లో ఓట్లు అడుగుతున్నారని కాంగ్రె్‌సను విమర్శించారు. ఇక.. నాడు (1947) నెహ్రూ కోరుకుని ఉంటే కొన్ని గంటల్లోనే గోవా విముక్తిని పొందేదని..ఆ పని చేయకపోవడంతో 17 ఏళ్లు అందుకు ఎదురుచూడాల్సి వచ్చిందని గోవాలోని మపుసాలో జరిగిన ఎన్నికల సభలో ఆయన వ్యాఖ్యానించారు. 


హిజాబ్‌ వివాదంపై పాక్‌ మరింత తెంపరితనం

హిజాబ్‌ వివాదంపై పాకిస్థాన్‌ మరింత తెంపరితనం ప్రదర్శించింది. ఇస్లామాబాద్‌లోని భారత దౌత్యాధికారికి గురువారం సమన్లు ఇచ్చి పిలిపించింది. ముస్లిం విద్యార్థినులను హిజాబ్‌ ధరించకుండా కర్ణాటకలోని విద్యాసంస్థలు నిషేధించడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందంటూ తన నిరసనను తెలిపింది. హిజాబ్‌ వివాదంపై ఆ దేశ విదేశాంగ మంత్రి షా మొహమ్మద్‌ ఖురేషీ ‘హితబోధ’ చేసిన మరునాడే ఈ చర్యకు ఒడిగట్టింది.  


హిజాబ్‌ ధరించి ఓట్లడిగిన హిందూ మహిళ

 ‘కోయంబత్తూర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ హిందూ మహిళ ‘హిజాబ్‌’ ధరించి ఓట్లు అడిగారు. బీజేపీ మిత్రపక్షమైన అన్నాడీఎంకే అభ్యర్థిగా నిలిచిన గోమతి 78వ వార్డునుంచి పోటీ చేస్తున్నారు. గోమతితో పాటు ఆమె మద్దతుదారులైన హిందూ మహిళలు కూడా హిజాబ్‌ ధరించి గురువారం సెల్వపురంలో ప్రచారం చేశారు.  మహిళల వస్త్రధారణ స్వేచ్ఛను కాంక్షిస్తూ తాను హిజాబ్‌ ధరించానని గోమతి వివరించారు. తన వార్డులో ముస్లిం కుటుంబాలు గణనీయంగా ఉన్నాయని, వారందరూ తనకు కుటుంబసభ్యులతో సమానమని ఆమె అన్నారు. 

Updated Date - 2022-02-11T08:17:33+05:30 IST