Railway Staff Fraud : రూ.500 నోటును రూ.20 నోటుగా మార్చిన రైల్వే క్లర్క్... గగ్గోలు పెట్టిన ప్రయాణికుడు...

ABN , First Publish Date - 2022-11-27T15:56:10+05:30 IST

ఓ రైల్వే ఉద్యోగి ఓ ప్రయాణికుడిని దారుణంగా మోసం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో

Railway Staff Fraud : రూ.500 నోటును రూ.20 నోటుగా మార్చిన రైల్వే క్లర్క్... గగ్గోలు పెట్టిన ప్రయాణికుడు...
Railway Clerk

న్యూఢిల్లీ : ఓ రైల్వే ఉద్యోగి ఓ ప్రయాణికుడిని దారుణంగా మోసం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో రైల్వే ఉన్నతాధికారులు ఆయనపై క్రమశిక్షణ చర్యలు ప్రారంభించారు. ఇటువంటి మోసాలకు సంబంధించిన అనుభవాలు తమకు చాలాసార్లు ఎదురయ్యాయని ఓ యూజర్ కామెంట్ చేశారు.

రైల్ విస్పర్స్ (Rail Whispers) అనే ట్విటర్ యూజర్ శుక్రవారం ఈ దారుణాన్ని వెలుగులోకి తెచ్చారు. హజ్రత్ నిజాముద్దీన్ (Hazrat Nizamuddin) రైల్వే స్టేషన్‌లో మంగళవారం ఓ ప్రయాణికుడు గ్వాలియర్ రైలులో ప్రయాణించేందుకు టిక్కెట్ కోసం ప్రయత్నించారు. టిక్కెట్ కౌంటర్ వద్దనున్న గుమస్తాకు రూ.500 నోటును ఇచ్చి, సూపర్‌ఫాస్ట్ గ్వాలియర్ రైలుకు టిక్కెట్ ఇవ్వాలని అడిగారు. ఆ నోటును తీసుకున్న గుమస్తా ఆ ప్రయాణికుడిని మళ్లీ ప్రశ్నిస్తూ, తన వద్దనున్న రూ.20 నోటును ముందు పెట్టి, ఆ రూ.500 నోటును తన వెనుక జేబులో పెట్టుకున్నారు. రూ.20 నోటును ప్రయాణికుడికి చూపిస్తూ, టిక్కెట్ ధర రూ.125 అని, మిగిలిన డబ్బులు ఇవ్వాలని అడిగారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను రైల్ విస్పర్స్ అనే యూజర్ ట్వీట్ చేశారు.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. రైల్వే సేవ (Railway Seva), ఢిల్లీ డివిజన్, నార్తర్న్ రైల్వే (డీఆర్ఎం ఢిల్లీ ఎన్ఆర్) దృష్టికి కూడా ఈ వీడియో వెళ్ళింది. రైల్వే సేవ ఇచ్చిన ట్వీట్‌లో ఈ విషయాన్ని డీఆర్ఎంకు తెలియజేసినట్లు తెలిపారు. డీఆర్ఎం ఢిల్లీ ఎన్ఆర్ ఇచ్చిన ట్వీట్‌లో, ఈ ఉద్యోగి చేసిన పనిని గుర్తించామని, ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ పోస్ట్‌లపై చాలా మంది యూజర్లు స్పందించారు. చెన్నై రైల్వే స్టేషన్‌లో తనకు చాలాసార్లు ఇటువంటి అనుభవాలు ఎదురయ్యాయని ఓ యూజర్ కామెంట్ చేశారు. కొందరు రైల్వే ఉద్యోగులు సంఘటితంగా రౌడీయిజం చేస్తున్నారని, ఇలాంటి నేరాలకు పాల్పడటానికి వారికి ధైర్యాన్నిఇస్తున్నది అదేనని తెలిపారు.

మరో యూజర్ స్పందిస్తూ, చాలా ప్రమాదకరమని, తాను ఇలాంటి మాయాజాలాన్ని మొదటిసారి చూస్తున్నానని తెలిపారు. దీనిని రికార్డు చేసి ఉండకపోతే ఏం జరిగి ఉండేదని ప్రశ్నించారు. కష్టపడి సంపాదించుకున్న సొమ్మును లాక్కుని, మోసగించేవాళ్ళకు సిగ్గు ఉండాలన్నారు.

Updated Date - 2022-11-27T15:56:15+05:30 IST