Rajiv Gandhi : రాజీవ్‌ను చంపిందిలా!
ABN , First Publish Date - 2022-11-12T04:08:23+05:30 IST
శ్రీలంక సైన్యం, ‘లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టీటీఈ)’ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో నాడు ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ ‘శాంతిపరిరక్షక దళం’ పేరుతో భారత సైన్యాన్ని అక్కడకు పంపించారు.
బెల్టు బాంబుతో ఆత్మాహుతి దాడి
రాజీవ్ మరో 14 మంది దుర్మరణం
అసలు సూత్రధారి శివరాసన్
చెన్నై, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): శ్రీలంక సైన్యం, ‘లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టీటీఈ)’ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో నాడు ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ ‘శాంతిపరిరక్షక దళం’ పేరుతో భారత సైన్యాన్ని అక్కడకు పంపించారు. భారత సైన్యం చేయూతతో సింహళ సైన్యం పైచేయి సాధించగా.. ఎల్‌టీటీఈ తీవ్రంగా నష్టపోయింది. అప్పటి నుంచి రాజీవ్‌పై కోపం పెంచుకున్న ఆ సంస్థ అదను కోసం ఎదురు చూసింది. 1989 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమితో రాజీవ్ ప్రధాని పదవి నుంచి దిగిపోయారు. 1991 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న సమయంలోనే ఆయన్ను తుదముట్టించేందుకు వ్యూహం రచించింది. ఇందులో భాగంగా యుద్ధ వ్యూహరచనలో నిపుణుడిగా పేరుగాంచిన శివరాసన్‌ను రంగంలోకి దింపింది. అతను శుభ, తెన్‌మొళి రాజరత్నం అలియాస్ థాను, శ్రీకరన్ అలియాస్ మురుగన్‌లతో కలిసి రాజీవ్ హత్యకు వ్యూహం రచించాడు. నళిని, శాంతను, రవిచంద్రన్, రాబర్ట్ ఫయాజ్, జయకుమార్ తదితరులను చేరదీశాడు. వారందరినీ తనకు అవసరమైనచోట వినియోగించుకున్నాడు.
1991 మే 21న విశాఖపట్నంలో ఎన్నికల ప్రచారం చేసిన రాజీవ్.. అనంతరం చెన్నై శివారు కాంచీపురం జిల్లా శ్రీపెరంబుదూర్ బహిరంగ సభలో పాల్గొనేందుకు వచ్చారు. కారు దిగి వేదిక వద్దకు వెళ్తున్న రాజీవ్.. కార్యకర్తలు, ప్రజలతో కరచాలనం చేస్తూ ముందుకు సాగారు. అప్పటికే సమయం రాత్రి 10 గంటలు దాటింది. అదే సమయంలో ఆయన వద్దకు వచ్చిన థాను.. ఆయనతో కరచాలనం చేసి తన దుస్తుల్లో ఉన్న బెల్టుబాంబును పేల్చుకుంది. ఈ దాడిలో రాజీవ్, మరో 14 మంది దుర్మరణం చెందారు. నిజానికి ఆ సభలో కాంగ్రె్‌సతోపాటు మరికొన్ని పార్టీల నేతలు కూడా పాల్గొనాల్సి ఉంది. చివరి నిమిషంలో వారు వివిధ కారణాలతో గైర్హాజరయ్యారు.