Rajiv Gandhi Case : రాజీవ్ హత్య కేసులో దోషిని ప్రియాంక గాంధీ ఏం అడిగారో తెలిసిపోయింది!
ABN , First Publish Date - 2022-11-13T17:18:58+05:30 IST
మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో ఓ దోషి అయిన నళిని శ్రీహరన్ ఓ దశాబ్దం క్రితం జరిగిన
చెన్నై : మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో ఓ దోషి అయిన నళిని శ్రీహరన్ ఓ దశాబ్దం క్రితం జరిగిన సంఘటన గురించి ఆదివారం మాట్లాడారు. తనను ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) కలిసినపుడు ఏర్పడిన పరిస్థితిని వివరించారు. అయితే ప్రియాంక వ్యక్తిగత అభిప్రాయాలను ఆమె బయటపెట్టలేదు. ఈ కేసులో మిగిలిన ఆరుగురు దోషులను సుప్రీంకోర్టు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ప్రియాంక గాంధీ 2008లో వెల్లూరు జైలులో ఉన్న నళినిని కలిశారు. అప్పుడు ఆమె తనతో మాట్లాడిన మాటలను నళిని ఆదివారం వెల్లడించారు. తన తండ్రి రాజీవ్ హత్య గురించి ఆమె అడిగారని చెప్పారు. ఆ సమయంలో ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారని చెప్పారు. తీవ్రంగా విలపించారని తెలిపారు. అప్పుడు ఆమెకు రాజీవ్ హత్య గురించి తనకు తెలిసిన విషయాలను చెప్పానని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె తనతో పంచుకున్న వ్యక్తిగత అభిప్రాయాలను తాను వెల్లడించబోనని చెప్పారు.
రాజీవ్ గాంధీ 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్‌లో హత్యకు గురయ్యారు. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి నళిని శ్రీహరన్. మూడు దశాబ్దాల అనంతరం ఈ కేసులోని ఏడుగురు దోషులకు జైలు జీవితం నుంచి విముక్తి లభించింది.
ఈ ఏడాది మే నెలలో ఏజీ పెరరివలన్‌ను సుప్రీంకోర్టు విడుదల చేసింది. ఆ తర్వాత నళిని, సుధీంద్ర రాజా వురపు సంతాన్, వీ శ్రీహరన్ వురపు మురుగన్, రాబర్ట్ పయస్, జయ కుమార్, రవిచంద్రన్ వురపు రవిలను శుక్రవారం విడుదల చేసింది.
రాజీవ్ గాంధీ సతీమణి సోనియా గాంధీ విజ్ఞప్తి, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ సిఫారసు ఆధారంగా తమిళనాడు గవర్నర్ 2000వ సంవత్సరంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. నళినికి కోర్టు విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చారు.