Vladimir Putin : రష్యా అధ్యక్షుడు పుతిన్ గురించి సంచలన వార్త
ABN , First Publish Date - 2022-12-03T11:15:24+05:30 IST
రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ (Vladimir Putin) మాస్కోలోని తన అధికారిక నివాసంలో
న్యూఢిల్లీ : రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ (Vladimir Putin) మాస్కోలోని తన అధికారిక నివాసంలో మెట్లపై నుంచి జారి పడిపోయినట్లు తెలుస్తోంది. ఆయన సుమారు రెండు నుంచి నాలుగు మెట్లపై నుంచి జారి పడిపోతుండగా ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆయనకు సహాయం చేసి, సోఫాలో కూర్చోబెట్టినట్లు సమాచారం. ఆయన వ్యక్తిగత వైద్యులు హుటాహుటిన వెళ్లి, ఆయనకు చికిత్స చేశారని తెలుస్తోంది.
జనరల్ ఎస్‌వీఆర్ అనే రష్యన్ టెలిగ్రామ్ ఛానల్ ఈ వార్తను బయటకు వెల్లడించినట్లు బ్రిటిష్ మీడియా చెప్తోంది. ఈ చానల్ పుతిన్‌ను విమర్శిస్తూ ఉంటుంది, ఆయన అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఆ విషయాన్ని క్రెమ్లిన్ బయటపెట్టడం లేదని నిరంతరం చెప్తూ ఉంటుంది. మెట్లపై నుంచి జారి పడిపోవడంతో ఆయన కీళ్లు వాచినట్లు, ప్రేగుల్లో కేన్సర్‌తో ఆయన బాధపడుతున్నట్లు తెలిపింది. వైద్యులు కొద్ది నిమిషాల్లోనే ఆయన వద్దకు చేరుకున్నప్పటికీ, ఆయనను తక్షణమే పరీక్షించలేదని కూడా ఈ ఛానల్ చెప్తోంది. వైద్యులు ఆయనను బాత్రూమ్‌కు తీసుకెళ్లి, శుభ్రం చేసుకోవడానికి సహాయపడినట్లు తెలిపింది. అనంతరం కీళ్ల వద్ద వాచినట్లు గుర్తించి, పెయిన్ కిల్లర్స్ ఇచ్చినట్లు పేర్కొంది. ఆయన జీర్ణాశయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. అయితే ఈ సంఘటనకు ఎటువంటి ఆధారాలను ఈ చానల్ చూపించలేదు, కేవలం విశ్వసనీయ వర్గాల సమాచారం అని మాత్రమే చెప్పింది.
పుతిన్ జారిపోకుండా కోటింగ్ ఉండే ప్రత్యేక షూస్ ధరిస్తారు. ఇంటి వద్ద కూడా వీటినే ధరిస్తారు. ఆయన నివాసంలో మెట్లు చాలా సురక్షితమైనవి. ఆయన తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, దీంతో వైద్యులు, ఆయన బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది.
ఇదిలావుండగా, ఈ సంఘటన జరిగినప్పటికీ పుతిన్ గురువారం యువ శాస్త్రవేత్తల సమావేశంలో మాట్లాడారు.