Shashi Tharoor : విదేశాంగ మంత్రి జైశంకర్‌పై శశి థరూర్ ప్రశంసల జల్లు
ABN , First Publish Date - 2022-12-11T11:04:51+05:30 IST
విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar)పై కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం
న్యూఢిల్లీ : విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar)పై కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) ప్రశంసల జల్లు కురిపించారు. ఐక్యరాజ్య సమితి ఆంక్షలు అమలవుతున్న దేశాల్లో మానవతావాద దృక్పథంతో కొన్ని మినహాయింపులు ఇవ్వడం కోసం ఉద్దేశించిన తీర్మానంపై ఓటింగ్ నుంచి భారత దేశం గైర్హాజరవడాన్ని సమర్థించారు. ఇటువంటి మానవతావాద చర్యలను బ్లాక్‌లిస్టెడ్ ఉగ్రవాద సంస్థలు వాడుకుంటున్నాయని భారత దేశం పేర్కొంది. నిధులను సేకరించి, ఉగ్రవాదులను చేర్చుకోవడానికి ఉపయోగించుకుంటున్నారని, తమ పొరుగు దేశంలో కూడా ఉగ్రవాదులు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని, ఇవన్నీ రుజువైన అంశాలని స్పష్టం చేసింది.
భారత దేశం ప్రస్తుతం ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి (UN Security Council)కు అధ్యక్షత వహిస్తోంది. అమెరికా, ఐర్లాండ్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానంపై ఓటింగ్ నుంచి గైర్హాజరైన దేశం భారత దేశం మాత్రమే. మిగిలిన 14 దేశాలు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. ఐక్యరాజ్య సమితికి భారత దేశ శాశ్వత ప్రతినిధి రుచిర కాంబోజ్ మాట్లాడుతూ, ఓటింగ్ నుంచి గైర్హాజరవడానికి కారణాన్ని వివరించారు. ఇటువంటి మానవతావాద సహాయాలను ఉగ్రవాదులు తమకు అనుకూలంగా సంపూర్ణంగా వినియోగించుకుంటున్నట్లు రుజువైందన్నారు. 1267 శాంక్షన్స్ కమిటీతో సహా అన్ని ఆంక్షల వ్యవస్థలను ఈ ఉగ్రవాద సంస్థలు ఎగతాళి చేస్తున్నాయని, మానవతావాద సహాయానికి వచ్చిన అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయని తెలిపారు. పాకిస్థాన్‌ను, ఆ దేశంలోని ఉగ్రవాద సంస్థలను పరోక్షంగా ప్రస్తావిస్తూ, ‘‘మా పొరుగున ఉన్న ఉగ్రవాద సంస్థలు , ఈ కౌన్సిల్ జాబితాలో చేర్చినవాటితో సహా, ఈ ఆంక్షలను తప్పించుకోవడం కోసం, మానవతావాద సంస్థలుగా, సివిల్ సొసైటీ గ్రూప్స్‌గా పునరుత్థానమవుతున్నాయని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. మానవతావాద సాయం అనే గొడుగు నీడలో ఈ ఉగ్రవాద సంస్థలు నిధులను సేకరించి, ఫైటర్స్‌ను నియమించుకుంటున్నాయి’’ అని తెలిపారు.
జమాత్ ఉద్ దవా (JuD) తనను తాను మానవతావాద దాతృత్వ సంస్థగా చెప్పుకుంటుంది. అయితే అది లష్కరే తొయిబా (LET) ఉగ్రవాద సంస్థను ముందుండి నడిపించే సంస్థగా అందరూ చూస్తారు. ఈ ఉగ్రవాద సంస్థలు ఫలాహ్-ఈ-ఇన్సానియత్ ఫౌండేషన్‌ను నడుపుతున్నాయి. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అల్ రహమత్ ట్రస్ట్‌ను నడుపుతోంది. ఈ ఉగ్రవాద సంస్థలు పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో శశి థరూర్ స్పందిస్తూ ఇచ్చిన ట్వీట్‌లో, ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో ఓటింగ్ నుంచి భారత దేశం గైర్హాజరవడాన్ని తాను పూర్తిగా సమర్థిస్తున్నానని తెలిపారు. ఈ తీర్మానం వెనుక ఉన్న మానవతావాద ఆందోళనను అర్థం చేసుకున్నానని, అయితే ఓటింగ్ నుంచి గైర్హాజరయ్యేలా భారత దేశాన్ని ప్రేరేపించిన అభ్యంతరాలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని తెలిపారు. రుచిర కాంబోజ్ మాటలను బలపరచే సాక్ష్యాధారాల కోసం మన సరిహద్దుల వెలుపలి కన్నా ఎక్కువ దూరం వెళ్ళనక్కర్లేదన్నారు. భారత దేశం, విదేశాంగ మంత్రి జైశంకర్ చాలా మంచి పని చేసినట్లు తెలిపారు.