Gujarat polls: స్టార్ కాంపెయినర్ల జాబితాలో పేరు లేకపోవడంపై శశిథరూర్ ఏమన్నారంటే..?
ABN , First Publish Date - 2022-11-16T19:35:18+05:30 IST
న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో తనకు చోటు దక్కకపోవడంపై ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్... తొలిసారి ..
న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల (Gujarat polls) కోసం కాంగ్రెస్ ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో తనకు చోటు దక్కకపోవడంపై ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ (Shashi Tharoor) తొలిసారి స్పందించారు. 40 మందితో కూడిన గుజరాత్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ పార్టీ మంగళవారం ప్రకటించింది. అందులో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో పాటు సచిన్ పైలట్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్, దిగ్విజయ్ సంగ్, కమల్‌నాథ్, భూపిందర్ సింగ్ హుడా, అశోక్ చవాన్‌లకు చోటు దక్కింది. శశిథరూర్ పేరు మాత్రం అందులో చోటుచేసుకోలేదు.
గుజరాత్ ముఖ్య ప్రచారకర్తల జాబతాలో చోటు కల్పించకపోవడం అసంతృప్తిని కలిగించిందా అని శశిథరూర్‌ను మీడియా అడిగినప్పుడు ఆయన చిరునవ్వుతో స్పందించారు. ''ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే సరిపోతారనేది కాంగ్రెస్‌కు తెలుసు. అందువల్ల అసంతృప్తి అనే ప్రశ్నకు తావులేదు'' అని శశిథరూర్ సమాధానమిచ్చారు. తిరువనంతపురం లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న శశిథరూర్ ఇటీవల కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గేపై పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ తరఫున గతంలో పలుమార్లు ఎన్నికల స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ముంబై, కోల్‌కతాలో ప్రచారం చేశారు. 2011,2016,2021లో కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం చేశారు. ఇటీవలనే నొయిడా ఉప ఎన్నిక ప్రచారంలోనూ పాల్గొన్నారు.