Shinde VS Uddhav: విల్లు-బాణం గుర్తును ఈసీ స్తంభింపజేస్తే ప్లాన్ బీ రెడీ..!
ABN , First Publish Date - 2022-10-07T23:06:33+05:30 IST
శివసేన థాకరే, ఏక్‌నాథ్ షిండే వర్గాలు మధ్య వివాదానికి దారితీసిన పార్టీ సింబల్ వ్యవహారం..
ముంబై: శివసేన థాకరే, ఏక్‌నాథ్ షిండే వర్గాలు మధ్య వివాదానికి దారితీసిన పార్టీ సింబల్ (SYMBOL) వ్యవహారం ఉభయులకూ ప్రతిష్టాత్మకంగా మారింది. దీనిపై ఎన్నికల కమిషన్ (EC) తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ ఏ వర్గానికి కేటాయించకుండా పార్టీ గుర్తును ఈసీ స్తంభింపజేస్తే (freeze) పరిస్థితి ఏమిటి? దీనిపై రెండు వర్గాలు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో పడ్డాయని, ప్లాన్-బీ (PLAN-B)కి సిద్ధమవుతున్నారని సమాచారం.
శివసేనకు 22 మంది ఎంపీల బలం ఉంది. లోక్‌సభలో 19 మంది, రాజ్యసభలో ముగ్గురు ఎంపీలు ఉన్నారు. ఈ 19 మందిలో 18 మంది మహారాష్ట్రకు, ఒకరు దాద్రా&నగర్ హవేలీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన 18 మందిలో 12 మంది షిండే వైపు మొగ్గుచూపుతుండగా, రాజ్యసభ సభ్యులు థాకరేతో ఉన్నారు. అలాగే మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీలో 55 మంది ఎమ్మెల్యేలకు, 40 మంది ఎమ్మెల్యేలు షిండే వర్గంలో ఉండగా, 15 మంది థాకరేతో ఉన్నారు. లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో శివసేనకు 12 మంది ఎమ్మెల్సీలు ఉండగా, మెజారిటీ సభ్యులు థాకరేతో ఉన్నారు. వెటరన్ శివసైనిక్ అంబాదాస్ డావ్నే కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.
ఒకవేళ ఈసీఐ 'విల్లు బాణం' గుర్తును స్తంభింపజేస్తే 'ప్లాన్ బీ' రెడీకి కసరత్తు జరుగుతోంది. షిండే వర్గం కత్తి (సోర్డ్- తల్వార్) గుర్తును కేటాయించాలని కోరే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఉద్ధవ్ వర్గం రెండో ఆప్షన్‌గా 'గద' గుర్తు కోరే అవకాశాలున్నాయి. ఇటీవల జరిగిన దసరా ర్యాలీల్లో షిండే 51 అడుగుల తల్వార్ (స్వార్డ్) రెప్లికాను ఆవిష్కరించి, శస్త్రపూజ చేశారు. థాకరే టీమ్ గద గుర్తును ఆశిస్తోంది. గతంలో థాకరే టీమ్ చేసిన పలు ప్రసంగాల్లోనూ గద ప్రస్తావన చోటుచేసుకుంది. కాగా, పార్టీ గుర్తును ఏ ఒక్క వర్గానికి చెందకుండా ఈసీఐ స్తంభిపజేసినట్లయితే కొత్త గుర్తు ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందని శివసేన వర్గాలు చెబుతున్నాయి.